బీజేపీ గాలానికి టీడీపీ బ్ర‌ద‌ర్స్ చిక్కిన‌ట్టే…!

-

ఏపీలో ఆపరేషన్ కమలం ముమ్మరం అయ్యింది. ఇప్పటికే టీడీపీకి చెందిన పలువురు కీలక నేతలను తమ పార్టీలో చేర్చుకున్న బిజెపి తాజాగా మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డిని పార్టీలో చేర్చుకున్న సంగతి తెలిసిందే. త‌మ పార్టీ కండువా కప్పుకుంటే ప్రాధాన్యతకు తగ్గ పదవులు అంటూ భరోసా ఉండడంతో పలువురు టీడీపీ నేతలు ఇప్పుడు బిజెపి వైపు చూస్తున్నారు. తాజాగా టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి, ఆయన సోదరుడు ప్ర‌భాక‌ర్‌రెడ్డిపై  కమలదళం గాలం వేసినట్టు తెలుస్తోంది.


ఆయనతో పాటు ఆయన కుటుంబం మొత్తాన్ని పార్టీలో చేర్చుకునేందుకు బిజెపి కీలక నాయకులు మంతనాలు జరుపుతున్నారని, జేసీ సోదరులతో పాటు వారి కుమారులు పార్టీలో చేరితే ప్రాధాన్యత గల పదవులు ఇస్తామని బీజేపీ నుంచి ఆఫర్ వచ్చినట్టు ఏపీ రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
రాయలసీమ జిల్లాల్లో టిడిపి బాగా బలహీనపడడంతో ఇదే అదనుగా బిజెపి అక్కడ బలోపేతం అయ్యేందుకు ప్రత్యేక ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పటికే కడప జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి కాషాయ కండువా పుచ్చుకున్న సంగతి తెలిసిందే. ఆయన ప్రభావంతో జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో బిజెపికి ఎంతోకొంత అవుతుందని బిజెపి నాయకులు అంచనా వేస్తున్నారు.

ఇక ఇప్పుడు అనంతపురం జిల్లా రాజకీయాల్లో దశాబ్దాల కాలం పాటు కొనసాగుతున్న జెసి సోదరులు రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్‌ను వీడి టీడీపీలో చేరారు. టిడిపిలో దివాకర్ రెడ్డి ఎంపీగా, ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో జెసి సోదరులు ఇద్దరు ఎన్నికల్లో పోటీ చేయకుండా తమకు బదులుగా తన కుమారులు పవన్ రెడ్డి, అస్మిత్ రెడ్డి లను ఎన్నికల బరిలోకి దించారు. ఘోరమైన పరాజయాన్ని మూట కట్టుకున్నారు. జెసి కుటుంబానికి మూడున్నర దశాబ్దాల రాజకీయ చరిత్రలో జేసీ వార‌సులు ఇంత ఘోరంగా ఓడిపోవడం పెద్ద ఎదురుదెబ్బ.

జెసి.దివాకర్ రెడ్డి తరచూ ఏదో ఒక కాంట్రవర్సీ కామెంట్ తో వార్తల్లో నిలుస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడున్న పరిస్థితుల్లో టిడిపిలో ఉంటే తమ వారసుల రాజకీయ భవిష్యత్ అగమ్యగోచరం గానే ఉంటుంది అన్న నిర్ణయానికి జెసి సోదరులు వచ్చేశారు. బిజెపి నాయకత్వం ఇచ్చిన ఆఫర్ తో జేసీ సోదరులు ఇద్దరు టిడిపికి ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్న బిజెపిలో చేరితే స్థానికంగా వైసీపీని ఎదుర్కోవడంతో పాటు జాతీయ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించ వచ్చ‌నే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా జెసి సోదరులు టిడిపిని వీడటం దాదాపు ఖాయమయిందని చెప్పాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version