సెప్టెంబర్‌లో జరగనున్న జేఈఈ, నీట్ పరీక్షలకు గాను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) శుక్రవారం అడ్మిట్ కార్డులను విడుదల చేసింది. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు జేఈఈ, నీట్ 2020 అడ్మిట్ కార్డులను ప్రస్తుతం అధికారిక వెబ్‌సైట్ల నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఎన్‌టీఏకు చెందిన jeemain.nta.nic.in తోపాటు nta.neet.nic.in వెబ్‌సైట్లలో ఆయా అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
కాగా సుప్రీం కోర్టు ఆయా పరీక్షలపై ఇటీవల ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా ప్రభుత్వ అధికారులు పరీక్షలను నిర్వహించనున్నారు. జేఈఈ మెయిన్ పరీక్షలు సెప్టెంబర్ 1 నుంచి 6వ తేదీ వరకు జరుగుతాయి. అలాగే నీట్ పరీక్ష సెప్టెంబర్ 13న జరుగుతుంది. జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షను సెప్టెంబర్ 27న నిర్వహిస్తారు.
అయితే ఆయా పరీక్షలపై ఆగస్టు 25వ తేదీ తరువాతే కేంద్రం చివరి ఆదేశాలు విడుదల చేస్తుందని తెలుస్తోంది. ఇక పరీక్షలు జరిగే కేంద్రాల్లో పూర్తిగా కోవిడ్ జాగ్రత్తలను పాటించనున్నారు. పరీక్షా కేంద్రాలను సంపూర్ణంగా శానిటైజ్ చేయాలి. విద్యార్థులు, ఇన్విజలేటర్లకు మాస్కులు, గ్లోవ్స్, హ్యాండ్ శానిటైజర్లు, డిసిన్ఫెక్టెంట్ స్ప్రేలను ఇస్తారు.
జేఈఈ, నీట్ 2020 అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్ ఇలా…
స్టెప్ 1 – పైన తెలిపిన సైట్‌లలో ఏదో ఒక సైట్‌ను అభ్యర్థులు సందర్శించాలి.
స్టెప్ 2 – సైట్‌లో ఉండే అడ్మిట్ కార్డ్ 2020 లింక్‌ను క్లిక్ చేయాలి.
స్టెప్ 3 – అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ, సెక్యూరిటీ పిన్‌లను ఎంటర్ చేసి సబ్‌మిట్ బటన్ ను క్లిక్ చేయాలి.
స్టెప్ 4 – అడ్మిట్ కార్డులో ఇచ్చిన వివరాలను చెక్ చేయాలి.
స్టెప్ 5 – వివరాలు సరిగ్గా ఉన్నాయనుకుంటే అడ్మిట్ కార్డును అక్కడే ఉన్న లింక్ ద్వారా పీడీఎఫ్ ఫైల్ రూపంలో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
స్టెప్ 6 – అడ్మిట్ కార్డును సేవ్ చేసి ప్రింట్ తీయాలి.
స్టెప్ 7 – కార్డుపై తల్లిదండ్రులు లేదా సంరక్షకులు సంతకం చేయాలి.
పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు తమకు కోవిడ్ లేదని, దానికి చెందిన లక్షణాలు కూడా లేవని ధ్రువీకరిస్తూ సెల్ఫ్ డిక్లెరేషన్ ఇవ్వాలి. అడ్మిట్ కార్డుతోనే ఈ ప్రొ ఫార్మా లభిస్తుంది. అభ్యర్థులు ఫాంపై పాస్‌పోర్టు సైజ్ ఫొటోను అతికించాలి.