గత కొన్ని రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జగన్ మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు జరుపుతారు అన్న చర్చ జరుగుతోంది. అటు రాష్ట్ర ప్రభుత్వం కూడా మంత్రివర్గ విస్తరణ కోసం సన్నాహాలు చేస్తున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇక ఈ వార్తలన్నింటికి తెరపడింది. తాజాగా జగన్ సర్కార్ మంత్రి వర్గ విస్తరణకు ముహూర్తం పిక్ చేసింది. ఈ నెల 22వ తేదీన మధ్యాహ్నం ఒంటిగంట తర్వాత ఏపీ మంత్రివర్గ విస్తరణ ఉంటుందని వెల్లడించింది జగన్ సర్కార్. ఈనెల 22వ తేదీన ఇద్దరు మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు సమాచారం. ఇటీవలే మంత్రి పదవులకు రాజీనామా చేసిన మోపిదేవి, పిల్లి సుభాష్ సామాజిక వర్గానికి చెందిన వారినే మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు ప్రస్తుతం ఆంధ్ర రాజకీయాల్లో చర్చలు జరుగుతున్నాయి.
రామచంద్రపురం ఎమ్మెల్యే అయిన చెల్లుబోయిన వేణు గోపాల కృష్ణ, పలాస ఎమ్మెల్యే సీదిరి అప్పల రాజు కు మంత్రి పదవులు దక్కే అవకాశం ఉన్నట్లు ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో చర్చించుకుంటున్నారు. మరోవైపు ఎమ్మెల్సీ ఎన్నిక కూడా శరవేగంగా జరుపుతోంది జగన్ సర్కార్. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులను కూడా ఖరారు చేసింది. ఇద్దరికీ ఎమ్మెల్సీ పదవులు ఇవ్వాలని నిర్ణయించిన జగన్ సర్కార్… మైనార్టీ, ఎస్సీ వర్గానికి చెందిన వారికి ఎమ్మెల్సీ పదవులు ఇచ్చేందుకు నిర్ణయించినట్లు తెలుస్తోంది.