ప్రపంచం మొత్తాన్ని భయభ్రాంతులకు గురి చేస్తున్న కరోనా వైరస్ మీకు కూడా వ్యాప్తి చెందుతుందని భావిస్తున్నారా..? మీకు ఆ వైరస్ వచ్చేందుకు అవకాశం ఉందని అనుకుంటున్నారా..? మీకు గానీ, మీ కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువుల్లో ఎవరికైనా సరే.. ఆ వైరస్ సోకుతుందని అనుకుంటున్నారా..? అయితే ఇందుకు సమాధానాలను తెలుసుకునేందుకు మీరు ఎక్కడికీ వెళ్లాల్సిన పనిలేదు. కేవలం ఈ టూల్ సహాయంతో మీకు కరోనా వస్తుందా, రాదా, రిస్క్ శాతం ఎంత ఉంటుంది..? అన్న వివరాలను తెలుసుకుని జాగ్రత్తగా ఉండవచ్చు.
కరోనా వచ్చేందుకు అవకాశం ఉంటుందా..? రిస్క్ ఏ మేర ఉంటుంది..? అనే వివరాలను తెలుసుకునేందుకు జియో ఓ నూతన కరోనా వైరస్ టూల్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ టూల్ జియో వెబ్‌సైట్, మై జియో యాప్‌తోపాటు https://covid.bhaarat.ai/ అనే వెబ్‌సైట్‌లోనూ అందుబాటులో ఉంది. ఈ టూల్ సహాయంతో మీకు లేదా మీ కుటుంబ సభ్యులు, స్నేహితులు, తెలిసిన వారికి కరోనా వచ్చేందుకు రిస్క్ ఎంత వరకు ఉంటుందనే విషయాన్ని తెలుసుకోవచ్చు. అందులో ఉండే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం ద్వారా ఆ రిస్క్ శాతం తెలుస్తుంది. లో రిస్క్, మోడరేట్ రిస్క్, హై రిస్క్ అని సమాధానాలు చూపిస్తుంది. దీంతో మీరు కరోనా వైరస్ రాకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు.
ఒక వేళ టూల్‌లో.. లో రిస్క్ అని వస్తే.. సామాజిక దూరం పాటించాలి. అదే మోడరేట్ రిస్క్ అని వస్తే.. ఇంట్లోనే ఉండాలి. బయటకు రాకూడదు. ఇక హై రిస్క్ అని వస్తే ఇంట్లో 14 రోజుల పాటు స్వీయ నిర్బంధంలో ఉండాలి. బయటకు రాకూడదు. అయితే ఈ టూల్ కేవలం జియో వినియోగదారులకు మాత్రమే కాదు, నాన్ జియో కస్టమర్లకు కూడా అందుబాటులో ఉంది. వారు కూడా ఈ టూల్‌ను ఉపయోగించుకోవచ్చు. ప్రస్తుతం ఇంగ్లిష్ భాషలోనే ఈ టూల్ అందుబాటులో ఉండగా, త్వరలో ఇతర భారతీయ భాషల్లోనూ ఈ టూల్‌ను అందివ్వనున్నారు. ఇక ఈ టూల్‌లో కరోనా సమాచారాన్ని తెలుసుకునేందుకు గాను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన హెల్ప్ లైన్ నంబర్లను కూడా అందుబాటులో ఉంచారు.