హైదరాబాద్‌లో జియో 5జీ సేవలు ప్రారంభం.. బెంగళూరులోనూ..

-

హైదరాబాద్‌లో ట్రూ-5జీ సేవలు ప్రారంభమయ్యాయి. భాగ్యనగరంతో పాటు బెంగళూరులోనూ 5జీ సేవలను ప్రారంభించినట్లు రిలయన్స్‌ జియో ప్రకటించింది. ఇప్పటికే హైదరాబాద్‌లో ఎయిర్‌టెల్‌ 5జీ సేవలు లభి స్తున్నాయి. జియో కూడా చెన్నై, ముంబయి, దిల్లీ, కోల్‌కతా, వారణాసి, నత్‌ద్వారా నగరాల్లో ట్రూ-5జీ బీటా సేవలను ఇప్పటికే అందిస్తోంది.

టెక్‌ నగరాలుగా పేరుగాంచిన హైదరాబాద్‌, బెంగళూరుల్లో 5జీ సేవల ప్రారంభంతో, ప్రజల జీవన ప్రమాణాలు మరింత మెరుగవుతాయని జియో తెలిపింది. సేవల్లో నాణ్యత కోసమే ట్రూ-5జీ సేవలను వివిధ నగరాల్లో దశలవారీగా ప్రారంభిస్తున్నట్లు వెల్లడించింది.  జియో  ట్రూ-5జీ వెల్‌కమ్‌ ఆఫర్‌లో భాగంగా, ప్రస్తుత వినియోగదార్లు ఎటువంటి అదనపు చెల్లింపులు లేకుండా 1జీబీపీఎస్‌ వేగంతో అపరిమిత డేటా పొందొచ్చని పేర్కొంది. 5జీ సేవలు నగరం అంతటా కాకుండా, తొలుత కొన్ని ప్రాంతాల్లోనే లభించే వీలుంది. 5జీ స్మార్ట్‌ఫోన్లలో సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌లను వినియోగదారులు సరిచూసుకోవాలి.

ఎయిర్‌టెల్‌, జియో నెట్‌వర్క్‌లపై 5జీ సేవలు పొందేందుకు వీలుగా తమ ఐఫోన్లలో 5జీ బీటా సాఫ్ట్‌వేర్‌ వెర్షన్‌ను యాపిల్‌ అప్‌డేట్‌ చేసింది. వినియోగదార్లు ఈ అప్‌డేట్‌ ఇన్‌స్టాల్‌ చేసుకుని, 5జీ సేవలను వాడుకోవాలని.. ఏవైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకొస్తే వాటిని పరిష్కరించేందుకే బీటా వెర్షన్‌ తీసుకొచ్చినట్లు యాపిల్‌ పేర్కొంది. డిసెంబరులో పూర్తి స్థాయి సాఫ్ట్‌వేర్‌ను విడుదల చేస్తామని వివరించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version