పదవుల పందేరం టీఆర్ ఎస్‌లో చిచ్చుపెట్టింది. మంత్రివర్గ విస్తరణతోపాటు , చీఫ్ విప్ , విప్ లాంటి పదవులు అధిష్టానానికి కొత్త సమస్యలు తెచ్చిపెడుతున్నాయి. పదవులు దక్కకపోవడంతో పలువురు సీనియర్ నేతలు అసమ్మతి గళాలు వినిపిస్తున్నారు. మాజీ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య బహిరంగంగానే తమ ఆవేదనను వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ తమను మోసం చేశారని నాయిని మీడియా ముఖంగా ఘాటుగా విమర్శలు గుప్పించారు.
అసమ్మతి గళాలకు చెక్ పెట్టేందుకు సీఎం కేసీఆర్ అనుసరించిన వ్యూహం, మరిన్ని అసంతృప్త గళాలకు ఊపిరిపోస్తోంది. ఈక్రమంలోనే రాష్ట్ర మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంతో మంత్రి జోగు రామన్న అజ్ఞాతంలోకి వెళ్లారనే ప్రచారం నేతలను ఆందోళనకు గురిచేస్తోంది. సోమవారం (సెప్టెంబర్ 9, 2019) ఉదయం నుంచి జోగు రామన్న ఫోన్ స్విచ్చాఫ్ అయింది. తన గన్ మెన్లను వదిలిపెట్టి ఒంటరిగా వెళ్లిపోయారు. అయితే మంత్రివర్గంలో చోటుదక్కని తన అనుచరులకు ముందుగానే సమాచారం ఇచ్చారు. రాత్రి వరకు కుటుంబ సభ్యులకు కూడా ఆయన అందుబాటులో లేరు.
దీంతో ఆయన ఎక్కడికి వెళ్లారని కుటుంబ సభ్యులు, పార్టీ వర్గాల్లోనూ టెన్షన్ నెలకొంది. జోగు రామన్న సైతం మంత్రివర్గ విస్తరణపై తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్లు సమాచారం. తనకు మంత్రి పదవి ఇవ్వకపోవడంతో ఆయన అలకబూనినట్లు తెలుస్తోంది. ఈటల రాజేందర్ వ్యాఖ్యలతో పార్టీలో మొదలైన కలకలం మంత్రివర్గ విస్తరణ తర్వాత కూడా సద్దుమణగడంలేదు.
మాజీ మంత్రులు నాయిని నరసింహా రెడ్డి, లక్ష్మారెడ్డి, జోగు రామన్న, మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రేఖానాయక్, రెడ్యానాయక్, అరూరి రమేశ్‌తో పాటు పలువురు నేతలు మంత్రి పదవులు ఆశించి భంగపడ్డారు. వీరిలో కనీసం ఇద్దరికి మంత్రి పదవులు ఖచ్చితంగా వస్తాయని ప్రచారం జరిగింది. కానీ ఆశావహులకు అదిష్టానం మొండిచేయి చూపింది. ఈ క్రమంలోనే కొందరు కొందరు నే తలు తమ అసంతృప్తి బహిరంగంగా వ్యక్తం చేస్తున్నారు.