ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లా జోషీమఠ్ పట్టణంలో భూమి కుంగిపోవడం తీవ్ర కలకలం రేపింది. భూమికి పగుళ్లు ఏర్పడటం, కుంగిపోవడం వల్ల సుమారు 600 ఇళ్లు దెబ్బతిన్నాయి. తీవ్ర భయాందోళనకు గురైన ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చి ఎముకలు కొరికే చలిలోనే కాలం గడుపుతున్నారు. భూమికి పగుళ్లు రావడం, నిర్మాణాలు కూలిపోవడం వెనుక ఉన్న కారణాలు అన్వేషించేందుకు కేంద్ర ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసింది.
జోషిమఠ్ ఘటనపై వాడియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ జియాలజీ డైరెక్టర్ కలాచంద్ సైన్ స్పందించారు. ఏళ్ల క్రితం కొండచరియలు విరిగిపడగా ఏర్పడిన శిథిలాలపై జోషిమఠ్ నిర్మితం కావడం వల్లే ప్రస్తుతం క్రమంగా కుంగిపోతుందని పేర్కొన్నారు. దాదాపు వందేళ్ల క్రితం జోషిమఠ్ ప్రాంతంలో సంభవించిన భారీ భూకంపం కారణంగా పెద్ద ఎత్తున కొండచరియలు విరిగిపడ్డాయని తెలిపారు. వాటి మీదే జోషీమఠ్ నిర్మాణం జరిగిందని… అందుకే పట్టణ పునాదులు బలహీనంగా ఉన్నాయని పేర్కొన్నారు.
ఈ ప్రాంతం భూకంపాల ముప్పు ఎక్కువగా ఉండే సెస్మిక్ జోన్-5లో ఉండటం… నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటం వంటి కారణాల వల్ల కూడా ఇక్కడి శిలలు కాలక్రమేనా బలహీనంగా మారిపోయాయని వెల్లడించారు. జోషీమఠ్‌కు ప్రమాదం పొంచి ఉందని చాలా ఏళ్లుగా హెచ్చరికలు ఉన్నట్లు కలాచంద్ సైన్ తెలిపారు.