హైదరాబాద్ జూబ్లీహిల్స్ మైనర్ బాలిక అత్యాచారం కేసులో ప్రధాన నిందితుడు సాదుద్దీన్ మాలిక్‌కు నాంపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో ఇప్పటికే ఐదుగురు మైనర్లు బెయిల్‌పై విడుదలయ్యారు.
మే 28న మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం జరగ్గా.. మే 31న బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయటంతో విషయం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకుని బాలిక వాంగ్మూలం సేకరించిన జూబ్లీహిల్స్ పోలీసులు.. విడతలవారిగా సాదుద్దీన్‌తో పాటు మరో ఐదుగురు మైనర్లను జూన్ 5న తేదీన అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. రాజకీయ రంగు పులుముకోవటంతో ఈ కేసును సవాలుగా తీసుకున్న పోలీసులు.. తీవ్రంగా శ్రమించి తగిన ఆధారాలు సేకరించారు.
నిందితులు నేరం చేసినట్టు నిరూపించేందుకు కావాల్సిన అన్ని సాక్ష్యాలను పోలీసులు సేకరించగా.. అందులో ఫోరెన్సిక్ నివేదిక కీలకంగా మారింది. తగిన సాక్ష్యాధారాలు సేకరించిన పోలీసులు.. కేసుకు సంబంధించి నేరాభియోగపత్రం దాఖలు చేశారు. ఈ కేసులో కీలక ఆధారాల కోసం.. అత్యాచారం చేసిన వాహనంలో దొరికిన వెంట్రుకలు, నాప్ కిన్ లు, వీర్యం నమూనాలు, తిని పారేసిన చూయింగ్ గమ్ లను ఫొరెన్సిక్ అధికారులు సేకరించారు.
మైనర్ బాలికపై అత్యాచారం జరిగిన రోజు ఆమె వేసుకున్న దుస్తులపై మైనర్ బాలుర డీఎన్ఏను ఎఫ్ఎస్ఎల్ అధికారులు గుర్తించారు. బాలిక దుస్తులపై దొరికిన నమూనాలు, కారులో లభ్యమైన ఆధారాలతో నిందితుల డీఎన్ఏ సరిపోలినట్లు జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపారు. ఈ ఒక్క కీలక ఆధారంతో.. అత్యాచారం వాల్లే చేశారనడానికి పోలీసులకు సరైన సాక్ష్యం దొరికినట్టైంది. ఫోరెన్సిక్ అధికారుల ఇచ్చిన నివేదిక వివరాలను పోలీసులు ఛార్జీషీట్‌లో పొందుపరిచారు.
ఇదొక్కటే కాకుండా.. బాధితురాలి నుంచి రెండు సార్లు స్టేట్‌మెంట్‌ను కూడా రికార్డు చేశారు. జైలులో నిర్వహించిన ఐడెంటిఫికేషన్ పరేడ్ లో నిందితులను బాధితురాలు గుర్తించినట్లు తెలుస్తోంది. అటు.. సీసీటీపీ దృశ్యాలతో పాటు మైనర్ బాలురు, ప్రధాన నిందితుడు సాదుద్దీన్ చరవాణీలను కూడా పోలీసులు పరిశీలించారు. అత్యాచారం జరిగిన సమయంలో అదే లోకేషన్‌లో వీళ్లందరి చరవాణీలు ఉన్నట్లు సాంకేతికత ఆధారాల ద్వారా పోలీసులు గుర్తించారు.
మరోవైపు.. లైంగిక పటుత్వ పరీక్షల్లోనూ నిందితులందరికీ సామర్థ్యం ఉన్నట్లు అధికారులు నివేదిక ఇచ్చారు. ఈ అంశాలన్నింటినీ పోలీసులు నేరాభియోగ పత్రంలో పొందుపరిచారు. మైనర్ బాలురను మేజర్లుగా పరిగణించి… విచారణ చేయాలని పోలీసులు జువైనల్ జస్టిస్ బోర్డును కోరనున్నారు. తీవ్రనేరం చేసినందుకు గాను మైనర్లను మేజర్లుగా పరిగణించి తగిన శిక్ష వేయాలని జూబ్లీహిల్స్ పోలీసులు నేరాభియోగపత్రంలో బోర్డును అభ్యర్థించారు. ఈ కేసులో ఇప్పటికే ఐదుగురు మైనర్లు బెయిల్‌పై విడుదలయ్యారు.