తమిళనాడులో సూపర్ స్టార్ రజని కాంత్, మక్కల్ నీది మయ్యాం పార్టీ అధినేత కమల్ హాసన్ కలిసి పని చేసే అవకాశం ఉందా…? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. రజని కాంత్ రాజకీయాల్లోకి వస్తారని గత కొంత కాలంగా ప్రచారం జరుగుతుంది. దీనిపై రజని కాంత్ అధికారికంగా ప్రకటన చేసినా ఆయన ఏదైనా పార్టీలో చేరతారా లేక కొత్త పార్టీ పెడతారా అనేది మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. ఆయన కూడా దీనిపై ఎలాంటి స్పందనా ఇప్పటి వరకు తెలియజేయలేదు. ఆయన సొంత పార్టీ పెడతారని కొందరు అంటే…
మరికొందరు… ఆయన బిజెపిలో చేరతారని వ్యాఖ్యలు చేశారు. అయితే… ఇటీవల ఒక రచయిత విగ్రహం విషయంలో మీడియా వేసిన ప్రశ్నకు ఆయన ఘాటుగా సమాధానం ఇచ్చారు. బిజెపి రాజకీయాలు తన మీద కాదంటూ చురకలు అంటించారు. దీనితో బీజేపీ తో ఆయన కలవడం లేదని స్పష్టత వచ్చిందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఇక సొంత పార్టీ పెట్టిన కమల్ ఏ విధంగా ప్రభావితం చేస్తారు అనేది ఇంకా స్పష్టత రాలేదు. ఈ తరుణంలో ఇప్పుడు ఒక వార్త బయటకు వచ్చింది. తమిళనాడులో అధికార అన్నా డీఎంకే విపక్ష డీఎంకే రెండు బలంగానే ఉన్నాయి.
పార్లమెంట్ ఎన్నికల్లో డీఎంకే సత్తా చాటింది. ఇప్పుడు ఈ రెండు పార్టీలను ఎదుర్కొని, బీజేపీకి ఎదురొడ్డి నిలబడాలి అంటే తాము ఇద్దరం కలిసి పని చేస్తేనే మంచిది అనే భావనలో ఇద్దరూ ఉన్నట్టు తెలుస్తుంది. ఈ మేరకు ఇద్దరు మధ్య ప్రాధమిక చర్చలు కూడా జరిగాయని ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఈ మేరకు కమల్ హాసన్ ప్రతిపాదన పంపగా దానికి రజని కాంత్ నుంచి స్పష్టత వచ్చిందని అంటున్నారు. అటు మీడియా కు కూడా దీనిపై ఒక స్పష్టమైన సమాచారం వచ్చిందని అంటున్నారు. త్వరలోనే వీరు కలిసి పని చేసే దానిపై అధికారిక ప్రకటన రానున్నట్టు తెలుస్తుంది. అయితే రజని పార్టీ పెడతారా…? లేక కమల్ పార్టీలో ఉంటారా…? లేదా విడిగా మద్దతు ఇస్తారా…? అనేది స్పష్టత రావడం లేదు.