మాస్టర్ ప్లాన్ రగడ.. కామారెడ్డిలో ముందస్తు అరెస్టులు

-

కామారెడ్డి మున్సిపల్ మాస్టర్ ప్లాన్ రద్దు కోసం రైతుల నిరసన కార్యక్రమం కొనసాగుతోంది. ఇవాళ కామారెడ్డి పురపాలక కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించాలని రైతులు నిర్ణయించారు. రైతుల ధర్నా నేపథ్యంలో పొలీసులు అప్రమత్తమయ్యారు. పట్టణంలోని పలువురు బీజేపీ కార్యకర్తలను.. విలీన గ్రామాల్లో రైతు ప్రతినిధులను ముందుస్తుగా అరెస్టు చేశారు. తెల్లవారుజాము నుంచే పొలీసులు గ్రామాలకు వెళ్లి పలువురిని అదుపులోకి తీసుకున్నారు.

కామారెడ్డి జిల్లాను పట్టణ బృహత్‌ ప్రణాళిక అంశం కుదిపేస్తోంది. పారిశ్రామిక ప్రాంతంలో భూములు కలిపారంటూ అన్నదాత ఉవ్వెత్తున నిరసనలు చేపట్టారు. ఈ క్రమంలోనే రామేశ్వర్‌పల్లెకు చెందిన రైతులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వ భూమి ఉన్నప్పటికీ.. పక్కనే ఉన్న పట్టా భూములను ప్రజా అవసరాల కోసం కేటాయించారని అందులో పేర్కొన్నారు.

దీనిపై ధర్మాసనం విచారణ చేపట్టింది. స్థిరాస్థి వ్యాపారుల ప్రయోజనాల కోసమే మాస్టర్ ప్లాన్ తయారు చేస్తున్నారని.. అన్నదాతల అభిప్రాయాలు కూడా తీసుకోవడం లేదని పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. దీనిపై వాదలు విన్న న్యాయస్థానం ఈ వివాదంలో రైతుల అభ్యంతరాలపై వైఖరి ఏమిటో తెలపాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version