తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి రిజైన్ చేసిన సీనియర్ రాజకీయ యోధుడు.. కన్నా లక్ష్మీనారాయణ ఫ్యూచర్ ఏంటి ? అలా మౌనంగా ఉండిపోతారా ? లేక ఏదైనా సాధిస్తారా ? మున్ముందు ఆయన ఏం చేయనున్నారు. ఇప్పుడు ఇవే ప్రశ్నలు బీజేపీ వర్గాల్లో జోరుగా వినిపిస్తున్నాయి. ఆయన రాష్ట్ర పగ్గాలను వదిలేసప్పుడు.. ఆసక్తికర విషయం వార్తల రూపంలో వచ్చింది. ఆయనను రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవాలని కేంద్ర బీజేపీ పెద్దలు ఆదేశించారని ఆ సమయంలో వారు బీజేపీ జాతీయ స్థాయిలో ప్రధాన కార్యదర్శి పదవిని ఇస్తామని హామీ ఇచ్చారని ప్రచారంలోకి వచ్చింది.
దీంతో రాష్ట్ర పగ్గాలు పోయినా.. జాతీయ స్థాయిలో కన్నాకు మంచి గుర్తింపు లభిస్తుందని అనుకున్నారు. త్వరలోనే బిహార్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఎన్నికలు కూడా ఉండడంతో బీజేపీకి నాయకుల అవసరం ఎంతైనా ఉంది. ఏపీకి పొరుగు రాష్ట్రమైన తమిళనాడులో కన్నా సేవలు వినియోగించుకునేందుకు అవకాశం ఉంది. దీంతో నిజంగానే ఆయనను ప్రధాన కార్యదర్శి పోస్టులో ఉంచారు. అయితే, రోజులు గడుస్తున్నా.. ఈ పదవి విషయంలో కన్నాకు క్లారిటీ రావడం లేదు. దీంతో ఢిల్లీలో ఏం జరుగుతోందని ఆరా తీస్తే.. కన్నాకు ఇప్పట్లో పదవి ఇచ్చే అవకాశం లేదని అంటున్నారు.
దీనికి ప్రధాన కారణం.. ఢిల్లీలో జాతీయస్థాయిలో చక్రం తిప్పే బీజేపీ పెద్దలతో కన్నాకు కలిసిరావడం లేదట. జీవీఎల్‌తో ఢీ అంటే ఢీ అన్న కన్నా.. రాజధాని విషయంలో తనను తాను పెద్దనని చెప్పుకొన్నారు. పోనీ.. రామ్ మాధవ్ వంటివారితో అయినా కలిసి మెలిసి ఉన్నారా? అంటే.. చంద్రబాబుకు మౌత్ పీస్‌గా మారారని.. రామ్ మాదవ్ అంతర్గత చర్చల్లో పేర్కొన్నారు. దీంతో జాతీయ స్థాయిలో కన్నాను బలపరిచే నాయకులు లేకపోవడం ఆయనకు ఇప్పుడు మైనస్‌గా మారింది. పైగా హిందీ సమస్యకూడా కన్నాను వెంటాడుతోంది. జీవీఎల్.. రామ్ మాధవ్ వంటివారు తెలుగు వారే అయినా.. ఉత్తరాదిలో విజృంభిచే స్థాయిలో హిందీ మాట్లాడగలరు. దీంతో కన్నా ఆశలు కొడిగడుతున్నాయని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.