ఉగాది నుంచి ఆడబిడ్డలకు ఇచ్చిన మాట ప్రకారం సన్నబియ్యం పంపిణీ చేయడం జరుగుతుందని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. తాజాగా ఖమ్మం జిల్లాలోని కల్లురు, పెనుబల్లి మండలాల్లో ఆయన పర్యటించి పలు అభివృద్ధి పనులతో పాటు ఇందిరమ్మ ఇళ్లకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ప్రజల దీవెనలతో అధికారంలోకి వచ్చిన ఇందిరమ్మ ప్రభుత్వం 15 నెలల కాలం పూర్తి చేసుకుందని తెలిపారు.
ఈ వ్యవధిలో మహిళలకు ఉచిత బస్సు హామీ నెరవేర్చామని ఇందుకు ఇప్పటివరకు 5,450 కోట్ల రూపాయలను ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లించిందని పేర్కొన్నారు. రూ.20,676 కోట్ల రైతు రుణమాఫీ చేయడం జరిగిందని తెలిపారు. ఏడాదిలోనే 56వేల మందికి పైగా నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిది అన్నారు. రూ.500 కే గ్యాస్ అందించిన ఘనత తమదే అన్నారు. రాజీవ్ యువ వికాసం అనే నూతన పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని.. దీనిద్వారా నియోజకవర్గానికి సుమారు 4వేల మందికి ఉపాధి అవకాశం దొరుకుతుందని తెలిపారు.