తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలు కార్తీక శోభను సంతరించుకున్నాయి. ముఖ్యంగా శివాలయాల్లో ఆధ్యాత్మికత వెల్లివిరుస్తున్నది. ఉదయం తెల్లవారు జాము నుంచే ఆలయాలకు భక్తులు పోటెత్తుతున్నారు. కార్తీక పూజలు చేస్తున్నారు. శివుడికి ప్రీతి పాత్రమైన అభిషేకాలు, మారేడు దళాలతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.
శివాలయాలు, ప్రముఖ పుణ్యక్షేత్రాలు భక్తులతో కళకళలాడుతున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వర క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. సంఘమ తీరంలో పుణ్యస్నానాలు చేస్తున్నారు. నదిలో కార్తీక దీపాలు వదులుతున్నారు. వరంగల్ అర్బన్ జిల్లాలోని వేయి స్తంభాల దేవాలయం, వేములవాడ పుణ్యక్షేత్రం, ధర్మపురి, విజయవాడలోని శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి దేవాలయం, శ్రీశైలం, ద్రాక్షారామం, సోమేశ్వర, రామలింగేశ్వర స్వామి ఆలయాల్లో భక్తుల కోలాహలం నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక కార్తీక పౌర్ణమి సందర్భంగా తిరుపతిలో ఇవ్వాల రాత్రి 7 గంటల నుంచి స్వామివారు గరుడ వాహనంపై దర్శనమివ్వనున్నారు.