కాశ్మీర్‌లోని ఇటీవల జరిగిన ఉగ్రదాడిపై రాజకీయ దుమారం కొనసాగుతోంది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సమావేశంలో ఈ ఘటనపై రాజకీయ వ్యాఖ్యలు చేయడంపై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ తీవ్రంగా స్పందించారు. భద్రతా వైఫల్యం అంటూ కాంగ్రెస్ రంధ్రాన్వేషణ చేస్తోందని, ప్రజల మధ్య విభజన తెచ్చే ప్రయత్నం చేస్తోందని ఆయన ఆరోపించారు. ఈ ఘటనను కాంగ్రెస్ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటోందని, ఒక ‘పొలిటికల్ ఈవెంట్’గా మార్చాలని చూస్తోందని లక్ష్మణ్ విమర్శించారు.కాంగ్రెస్ పార్టీకి పాకిస్తాన్ మీద ప్రేమ కొత్తేమీ కాదని, ఆ పార్టీ నేతలు పాకిస్తాన్‌ను ప్రేమిస్తున్నామని బహిరంగంగానే మాట్లాడారని లక్ష్మణ్ అన్నారు. “కాంగ్రెస్ నేతలకు పాకిస్తాన్ గురించి మాట్లాడేందుకు మనస్సు ఒప్పుకోవడం లేదు.
మతం తెలుసుకుని హిందువులను కాల్చి చంపారు. సాఫ్రాన్ టెర్రరిజం అని ఒకప్పుడు మాట్లాడిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ఇస్లాం టెర్రరిజం, జిహాదీ టెర్రరిజం అనలేకపోతున్నారు” అని ఆయన ఆరోపించారు. రాబర్ట్ వాద్రా చేసిన వ్యాఖ్యలు ఉగ్రవాదులను సమర్థించేలా ఉన్నాయని, సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయని లక్ష్మణ్ విమర్శించారు. రాబర్ట్ వాద్రా వ్యాఖ్యలను కాంగ్రెస్ ఎందుకు ఖండించడం లేదని ఆయన ప్రశ్నించారు. కాశ్మీర్ ఉదంతంపై బీఆర్ఎస్ పార్టీ మౌనం వహించడం దేనికి సంకేతమని ఆయన నిలదీశారు. మజ్లిస్ కోసమే బీఆర్ఎస్ మాట్లాడటం లేదా అని ఆయన సందేహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కేటీఆర్ మజ్లిస్‌కు సహకరించారని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ చౌకబారు రాజకీయాలు మానుకోవాలని, జాతీయ భద్రతా అంశాలను రాజకీయాలకు వాడుకోవడం తగదని లక్ష్మణ్ అన్నారు.