ఈ మధ్య దేశ స్థాయిలో జరుగుతున్న రాజకీయపరిణామాలు అత్యంత ఆసక్తికరంగా మారాయి. ముఖ్యంగా సీఎం కేసీఆర్ మూడో కూటమి భవిష్యత్తు ఏమిటనేది ప్రశ్నార్థకంగా నిలిచింది. తన వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఏకంగా కాంగ్రెస్ లో చేరేందుకు సంసిద్ధమయ్యారు. ఇందుకు ముహూర్తం ఫిక్స్ చేయడమే తరువాయి. మరి ఆయన కాంగ్రెస్ లో చేరితే తెలంగాణలో టీఆర్ ఎస్ గెలుపునకు కృషి చేస్తారా? పీకే తో బంధం ఉంటుందా? పోతుందా అన్నది శేష ప్రశ్నగానే మిగలనుంది. మరోవైపు..కాంగ్రెస్, బీజేపీయేతర కూటమి కోసం చేస్తున్న ప్రయత్నాలు ఒక్క అడుగూ ముందుకు పడటం లేదు. ఆయా పార్టీలతో కేసీఆర్ సమావేశాలు నిర్వహించినా ఫలితం మాత్రం కనిపించడం లేదు. మొన్న దాదాపు 13 ప్రతిపక్షాలు కేంద్రానికి లేఖ రాస్తే అందులో సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ పేరు లేకపోవడం పెద్ద షాక్ వంటిదే.
ఈ లేఖలో కాంగ్రెస్, శివసేన, డీఎంకే. టీఎంసీ, జేఎంఎం వంటి పార్టీలు సంతకాలు చేశాయి. ఈ లేఖపై సంతకాలు చేసినవారిలో శరద్ పవార్, స్టాలిన్, శిబుసోరెన్ వంటి నేతలతో సీఎం కేసీఆర్ గతంలోనే భేటీలు నిర్వహించారు కూడా. అయినా కేసీఆర్‌ను పూర్తిగా పక్కన పెట్టడం రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ పరిణామాలను గమనిస్తే కాంగ్రెస్ మిత్రపక్షాలను ఒప్పించడంలో కేసీఆర్ విఫలమయ్యారా? లేక ఆయనను ఎవరూ పట్టించుకోవడం లేదా? అన్న సంశయం ఏర్పడుతోంది. కేసీఆర్ తరహాలోనే బీజేపీ, కాంగ్రెస్ రెండింటినీ వ్యతిరేకించిన ఆప్ కూడా ప్రస్తుతం నెలకొన్న రాజకీయాల నేపథ్యంలో కాంగ్రెస్కు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తోంది. ఈ మేరకు సంకేతాలు ఇస్తోంది. రాబోయే గుజరాత్ ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకునేందుకు సిద్ధమని పార్టీ నేతల ద్వారా చెప్పిస్తోంది. విపక్షాల అనైక్యతే బీజేపీ బలమని నమ్మిన అన్నిపార్టీలు చివరకు కాంగ్రెస్ గొడుగునీడలో ఏకమయ్యేందుకు సముఖుత వ్యక్తం చేస్తున్నట్లుగా కనిపిస్తున్నాయి.
దేశవ్యాప్తంగా మతతత్వం, హింసాత్మక ఘటనలను నిరసిస్తూ దేశంలో ప్రధానమైన 13 ప్రతిపక్షాలు కేంద్రానికి లేఖ రాసినప్పుడు కేసీఆర్ ను పరిగణనలోకి తీసుకోకపోవడం గమనార్హం. ఈ విషయంలో కేసీఆర్ ను సంప్రదించినట్లుగా కూడా సమాచారం లేదు. ఇందుకు కేసీఆర్ తీరు కూడా ఒకందుకు కారణమే. బీజేపీ ప్రభుత్వానికి మొదట్లో బేషరతుగా మద్దతు పలికారు. రాష్ర్టపతి ఎన్నిక నుంచి మొదలుకుని వ్యవసాయ చట్టాల వరకూ అన్నింటికీ మద్దతు పలికారు. కోవిడ్ సందర్భంలో తాళాలు బజాయించాలని, దీపాలు వెలిగించాలని ప్రధాని మోడీ పిలుపును బహిరంగంగానే సమర్థించారు. కానీ రాష్ట్రంలో రాజకీయాలు మారడం, బీజేపీ బలపడుతుండటంతో ఆ పార్టీతో విభేదిస్తున్నారని అన్ని పార్టీలు భావిస్తున్నాయి. తన స్వప్రయోజనాల కోసమే ఇదంతా అని నమ్ముతున్నట్లుగా అనిపిస్తంఓది. ఇదిలా ఉంటే.. బీజేపీ కూడా కేసీఆర్ తో సమరమే అన్నట్లుగా వ్యవహరిస్తోంది. గవర్నర్ తో వివాదం, నేరుగా కేసీఆర్ ప్రభుత్వంపై తమిళి సై చేస్తున్న ఆరోపణలను చూస్తుంటే కమలంతో కారు పోరు ఖాయమైపోయింది. మరి ఇలాంటి పరిస్థితిలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఏం చేస్తారా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. బీజేపీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నందున కాంగ్రెస్ కూటమితో జట్టుకడతారా? మళ్లీ మొదటిలాగే అంశాల ప్రాతిపదికన బీజేపీకి మద్దతు ఇస్తారా? అయితే.. రాజకీయ చతురుడు, దురంధురుడిగా పేరుగాంచిన కేసీఆర్ ఈ రాజకీయాలను తనకు అనుకూలంగా మలుపు తిప్పుకోవడం ఆయనకు పెద్ద కష్టమేమి కాదని భరోసా, నమ్మకం కూడా తెలంగాణ ప్రజల్లో ఉంది.