దిశ అత్యాచారం, హత్య సంఘటనలో నలుగురు నిందితులు ఎన్‌కౌంటర్‌కు గురికావడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే ఇప్పుడు ఈ సంఘటన తీరుతెన్నులను చూస్తే నాటి స్వర్గీయ సీఎం, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్నే ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం కూడా తీసుకున్నట్లు కనిపిస్తుంది. ఇప్పటికే తెలంగాణ సీఎం కేసీఆర్ ఎక్కువగా వైఎస్సార్ పరిపాలన తీరుతెన్నులను అచ్చంగా అలాగే పరిపాలన చేస్తున్నారు అనే చర్చ జరుగుతున్నది. ఇప్పడు దిశ సంఘటనలోనూ అచ్చు రాజశేఖరరెడ్డి ని ఫాలో అయ్యారు కేసీఆర్. అయితే ఇక్కడ 2008లో వరంగల్‌లో ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థినులపై యాసిడ్ దాడి జరిగింది.
ఇందులో ఒక విద్యార్థి చనిపోగా, ప్రణీత అనే అమ్మాయి మాత్రం ఇంకా ఆనాటి సంఘటనకు సజీవ సాక్షిగా ఉన్నారు. అయితే ఆనాడు జరిగిన యాసిడ్ దాడితో దేశం అట్టుడికి పోయింది. రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. వరంగల్ యాసిడ్ దాడిపై సత్వర న్యాయం కోసం దేశం యావత్తు డిమాండ్ చేసింది. ఆందోళనలు, ధర్నాలతో ఏపీ అట్టుడికి పోయింది. అయితే ఈ కేసును రాజశేఖరరెడ్డి ప్రత్యేక పర్యవేక్షణ చేశారు. వరంగల్ లో విధులు నిర్వహిస్తున్న వీసీ సజ్జనార్ కు ఈకేసును అప్పగించింది ప్రభుత్వం. ఈ కేసులోనూ సీన్ కన్‌స్ట్రక్షన్ చేస్తున్న క్రమంలోనే నిందితులు పోలీసులపై దాడి చేసి పారిపోయే ప్రయత్నం చేసిన క్రమంలో పోలీసులు కాల్పులు జరిపారు.
ఈ కాల్పుల్లో ఆనాటి నిందితులు ఎన్‌కౌంటర్ అయ్యారు. అప్పుడు రాజశేఖరరెడ్డి ప్రభుత్వం చేసిన ఈ చర్యను దేశవ్యాప్తంగా హర్షించింది. ఇప్పుడు దిశను అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి, హత్య చేసి, పెట్రోల్ పోసి తగలబెట్టడంతో దేశం అట్టుడికి పోయింది. ఈ సంఘటనకు పాల్పడిన నిందితులను వెంటనే ఎన్‌కౌంటర్ చేయాలని దేశవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. అయితే కేసీఆర్ సర్కారు ఆనాటి రాజశేఖరరెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేసేందుకు సిద్ధమయ్యాడు.
అందుకే తరహాలో అదే పోలీసు అధికారి సజ్జనార్ కు ఈ కేసును కేసీఆర్ అప్పగించారు. దీంతో ఈ సంఘటన పై విచారణ చేస్తున్న పోలీసులపై నిందితులు తిరుగుబాటు చేయడం, దీనికి ప్రతిగా పోలీసులు కాల్పులు జరుగడం, దీంతో నిందితులు ఎన్‌కౌంటర్ కావడం జరిగింది. ఇప్పుడు ఈ ఎన్‌కౌంటర్, ఆనాటి ఎన్‌కౌంటర్‌కు అచ్చుగుద్దినట్లుగా ఉంది. రాజన్న బాటలో కేసీఆర్ ప్రభుత్వం పయనిస్తుందనడానికి ఇదే నిదర్శనం.