తెలంగాణలో ఆర్టీసీ సమ్మె 31వ రోజుకు చేరుకుంది. రోజులు పూర్తయి వారాలు గడచి.. నెల కావస్తున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె ముగియడం లేదు. సీఎం కేసీఆర్ నవంబర్ 5వ తేదీ అర్ధరాత్రిలోగా ఆర్టీసీ కార్మికులు తిరిగి విధుల్లో చేరాలని ప్రకటన చేయటంతో కొందరు ఆర్టీసీ ఉద్యోగులు విధుల్లో చేరుతున్నారు. అయితే కేసీఆర్ రాష్ట్రంలోని 10,400 రూట్లలో 5,100 ప్రైవేట్ రూట్లకు పర్మిట్లు ఇస్తామని స్పష్టం చేశారు. మెరుగైన రవాణా సదుపాయం మరియు ఆరోగ్యకరమైన పోటీతత్వం కోసం మాత్రమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పల్లెవెలుగు బస్సు మార్గాలను మాత్రమే ప్రైవేట్ ఆపరేటర్లకు ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
నిన్నటినుండి సీఎం కేసీఆర్ ప్రైవేట్ బస్సులకు అనుమతి ఇవ్వటంతో బస్ పాసుల గురించి ప్రజల్లో గందరగోళం నెలకొంది. ప్రైవేట్ బస్సుల్లో బస్ పాసులు అనుమతించరు కదా? అనే ప్రశ్న ప్రజల్లో మొదలైంది. అయితే ఈ విషయంపై ప్రభుత్వ నియంత్రణలోనే ప్రైవేట్ బస్సులు కూడా ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. వికలాంగులు, విద్యార్థులు, జర్నలిస్టులు, టీఎన్జీవోలు ఇలాఎవరెవరికి ఏ బస్ పాసులు అమలులో ఉన్నాయో ఆ బస్ పాసుల రాయితీలు యధావిధిగా కొనసాగుతాయని ప్రజలకు గుడ్ న్యూస్ తెలియజేశారు.