ఏపీలో రాజకీయ సమీకరణలు ఎప్పుడు ఎలా ? మారతాయో ? అర్థం కావడం లేదు. బలంగా ఉన్న అధికార వైసీపీని తట్టుకోవడం విపక్ష పార్టీలకు సాధ్యం కావడం లేదు. ఏపీలో అసలే మాత్రం పట్టులేని బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండడంతో డాంబికాలు పోతున్నా… ఎంత చేసినా ఇక్కడ వైసీపీని కొట్టడం కష్టమే అన్నది ఆ పార్టీ నేతలకు కూడా తెలుసు. ఇక విపక్ష టీడీపీ ఇప్పటికే బిక్క చచ్చిపోయింది. చరిత్రలోనే లేనంత ఘోరంగా కేవలం 23 సీట్లతో సరిపెట్టుకుంది.
ఇక పవన్‌కళ్యాణ్ జనసేన సైతం కేవలం 7 శాతం ఓట్ల షేరింగ్‌తో 1 సీటు మాత్రమే గెలిచింది. ఇక జనసేన గురించి ఇప్పుడు ఏపీలో మాట్లాడుకోవడానికేం లేదు. మరోవైపు నాలుగు దశాబ్దాల చరిత్ర ఉన్న టీడీపీ కూడా ఆరు నెలల్లోనే ఖాళీ అవుతుందా ? అన్న సందేహాలు వచ్చేస్తున్నాయి. ఈ క్రమంలోనే 2014 ఎన్నికల్లో మిత్రులు.. 2019 ఎన్నికల్లో శత్రువులుగా ఉన్న టీడీపీ – జనసేన ఇప్పుడు మళ్లీ ఒక్కటయ్యేందుకు పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది.
2014 ఎన్నికల్లో పవన్, బీజేపీ సపోర్ట్‌తోనే ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చిందన్నది వాస్తవం. అయితే ఇటీవల ఎన్నికల్లో ఈ మూడు పార్టీలు ఎవరిదారి వారిదే అన్నట్టుగా పోటీ చేశాయి. ఇప్పుడు జగన్ ఏకంగా 151 సీట్లతో తిరుగులేని బలమైన నేతగా ఉన్నారు. వైసీపీ దూకుడు ముందు టీడీపీ నేతలు ఎవ్వరూ ఆగే పరిస్థితి లేదు. టీడీపీకి, ఆ పార్టీ నేతలకు చుక్కలు కనపడుతున్నాయి.
ఇక ఇప్పుడు టీడీపీ, జనసేనకు చెందిన పలువురు కీలక నేతలు ఇతర పార్టీల్లోకి చేరిపోతున్నారు. ఇక ఇప్పుడు మళ్లీ టీడీపీ – జనసేన ఒక్కటి అయ్యేందుకు రెడీ అవుతున్నాయి. తాజాగా పవన్ ఇసుక కొరత నేపథ్యంలో పిలుపు ఇచ్చిన లాంగ్ మార్చ్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు సపోర్ట్ ప్రకటించారు. ఈ లాంగ్ మార్చ్‌లో టీడీపీకి చెందిన మాజీ మంత్రులు పాల్గొనాలని చెప్పారు.
ఇక గత ఎన్నికల్లోనూ తెలుగుదేశం పార్టీ, జనసేనలు కలిసి పోటీ చేసి ఉంటె కొంత మెరుగ్గా ఉండేది. ఈ తప్పును కంటిన్యూ చేయకుండా ఉండేందుకే ఇప్పుడు బాబు జనసేనకు దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల నుంచే ఈ రెండు పార్టీలు పొత్తులు పెట్టుకుని 2024లో కూడా కలిసే పోటీ చేసే ఛాన్సులు ఉన్నాయి.