సాగర్ లో ప్రచారం చేస్తున్న టీఆర్ఎస్ నేతలను కేసీఆర్ నమ్మడం లేదా

-

నాగార్జునసాగర్‌ ఉపఎన్నికను టీఆర్‌ఎస్‌ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తమ సిట్టింగ్‌ స్థానాన్ని నిలబెట్టుకోవడంతోపాటు అటు కాంగ్రెస్‌కు, ఇటు బీజేపీకి చెక్‌ పెట్టాలని చూస్తుంది. అందుకే ఈ బైపోల్‌కు పక్కా వ్యూహాన్ని సిద్ధం చేశారు సీఎం కేసీఆర్‌. మండలానికో ఇంఛార్జ్‌ని నియమించారు. అంతేకాదు ఆ ఇన్‌ఛార్జులు ఎలా పనిచేస్తున్నారో పక్కాగా తెలుసుకుంటున్నారు. నేతలు తమకు అప్పగించిన ప్రాంతాల్లో తిరిగారా, లేదా అని జీపీఎస్‌ ట్రాకింగ్‌తో పర్యవేక్షిస్తున్నారట. దీంతో ఫీల్డ్ లో‌ ఉన్న నేతల్లో కొత్త టెన్షన్ పట్టుకుంది.


నాగార్జునసాగర్ ఉపఎన్నికను గులాబీ బాస్ సీరియస్‌గా తీసుకున్నారు. రాష్ర్టంలో మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో సాగర్ ఎన్నిక గెలవడం టీఆర్ఎస్ పార్టీకి చాలా కీలకం. అందువల్ల ఇక్కడ గెలవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తోంది టీఆర్‌ఎస్‌. అందుకే సాగర్‌లో ఉన్న అన్ని మండలాలకు, మున్సిపాలిటీకి ఇంఛార్జీలను నియమించింది. కీలకమైన ఈ ఉపఎన్నికలో స్థానిక నేతలపైనే నమ్మకం పెట్టుకుంటే.. నష్టం జరుగుతుందేమో అన్న ముందుచూపుతో బయట ప్రాంతాలకు చెందిన వారిని ఇంఛార్జిలుగా నియమించారు.

దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాల నుంచి గుణపాఠాలు నేర్చుకున్న టీఆర్‌ఎస్‌.. ఈసారి తమ వ్యూహాలను మరింత పదునుపెట్టింది. అందుకే గతంలో ఏ ఎన్నిక జరిగినా ఒక్కరిని మాత్రమే ఇంఛార్జ్‌గా నియమించేవారు. ఇప్పుడు ఆ పద్ధతిని మార్చారు. నారాయణపేట్, వరంగల్, పాలేరు, హుజూర్ నగర్ , దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికలప్పుడు ఒక్క పద్దతిని.. ఇప్పుడు సాగర్‌లో మరో పద్దతిని కేసీఆర్ అనుసరిస్తున్నారట.

రాష్ర్టంలో బీజేపీ బలపడేందుకు తీవ్రంగా ప్రయత్నస్తోంది. అదే సమయంలో కాంగ్రెస్‌ నుంచి సాగర్‌లో పోటీ చేస్తోంది సాదా సీదా వ్యక్తి కాదు. సుదీర్ఘ కాలం మంత్రిగా, కాంగ్రెస్‌ సీనియర్‌ నేతగా.. రాజకీయాల్లో తలపండిన నేతగా జానారెడ్డికి పేరు ఉంది. అందుకే సాగర్ గెలుపు కోసం డైరెక్ట్ గా పార్టీ అధినేత కేసీఆర్ రంగ ప్రవేశం చేశారని అంటున్నారు. మండలానికి ఇద్దరు ఎమ్మెల్యేలు, ఆ మండలంలో బలంగా ఉన్న కుల నేతలను గత మూడు నెలల నుంచి రంగంలోకి దించారు. జానా రెడ్డికి పట్టు ఉన్న నియోజకవర్గం కావడంతో.. ఇక్కడ ఆయనపై పైచేయి సాధించడానికి కేసీఆర్ పకడ్బందీ వ్యూహం రచించారు. అందులో భాగంగానే ఇంచార్జిలుగా నియమించి.. వారి వాహనాలకు సైతం జిపిఎస్ ద్వారా ట్రాకింగ్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. కొంతమంది నేతలు ఎండలకు భయపడి తిరగకుండా ఉన్నారంట. దీంతో వారి పనితీరును ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ.. వారికి వార్నింగ్ ఇస్తున్నారంట. చేతకాక పోతే మీరు వెనక్కి రండి. మీ ప్లేసులో మరొకరిని పంపిస్తానని హెచ్చరికలు జారీ చేశారంట.

బయటి ప్రాంతాల నుంచి వచ్చిన ఎమ్మెల్యేలకు.. ఇప్పుడు ఎరక్కపోయి వచ్చామన్నట్లుగా ఉందట. డైరెక్ట్ గా సీఎం కేసీఆరే పర్యవేక్షిస్తూ ఎక్కడ ఏ లోపం ఉందో ఆయనే స్వయంగా చెబుతున్నారంట. దీంతో ఇన్ చార్జి ఎంఎల్ఏలు, నేతలకు ఎప్పుడు కేసీఆర్‌ నుంచి కాల్ వస్తుందోనన్న ఆందోళన కనిపిస్తోంది. మొదట ఏదో ఇన్ చార్జిగా నడపేయవచ్చని భావించిన నేతలకు, ఇప్పుడు మాత్రం అది అంత ఈజీ కాదన్న విషయం అర్ధమవుతోంది. కేసీఆర్ స్పెషల్ ట్రాకింగ్ ఎవరి కొంప ముంచుతుందో అన్న భయం నేతల్లో కనిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version