వరిధాన్యం కొనుగోలుపై మరోసారి సీఎం కేసీఆర్ ఫైరయ్యారు. కేబినెట్ మీట్ అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కేంద్రం చిల్లర కొట్టు యజమానిలా వ్యవహరిస్తుందన్నారు. ధాన్యం కొనుగోలులో వివక్ష చూపిస్తుందని అన్నారు. కేంద్రం మాట్లాడితే పచ్చి అబద్ధాలు చెబుతుందన్నారు. 140 కోట్ల మందికి బాధ్యత వహించే కేంద్రం ఇలా వ్యవహరించవద్దని ఆయన అన్నారు. కేంద్రం రైతుల, పేదల వ్యతిరేఖ విధానాలను అమలు చేస్తోందని దుయ్యబట్టారు.
ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం నష్టం వచ్చినా రైతుల కోసం భరించేలా ఉండాలని.. ధాన్యం కొనుగోలుకు ఓ లక్ష కోట్ల రూపాయలైనా కేటాయించాలని హితవు పలికారు. రైతుల విషయంలో లాభనష్టాలను బేరీజు వేసుకునే కేంద్ర ప్రభుత్వాన్ని ఇదివరకు చూడలేదని.. ఇక ముందట చూడం అని కేసీఆర్ అన్నారు. తెలంగాణలో యాసంగిలో పండేవి బాయిల్డ్ రైసే అని.. వీటిని తీసుకోవాలని ఎన్నిసార్లు కేంద్రాన్ని కోరినా.. స్పందన లేదని ఆయన అన్నారు. బాధ్యత నుంచి తప్పించుకుని రాష్ట్రాలపై నెపం నెట్టాలని చూస్తుందని ఆయన కేంద్రాన్ని విమర్శించారు.