సోషల్ మీడియాలో ఓ వార్త. కేసీఆర్ తన మకాంను శాశ్వతంగా హస్తినకు మార్చనున్నారు. రేపు జరగబోయే పార్టీ ఆవిర్భావ వేడుకలో బ్లాక్ బస్టర్ లాంటి.. దేశమే కంపించిపోయే న్యూస్ చెప్పనున్నారు. అదేమిటంటే.. కొత్త పార్టీ. జాతీయస్థాయిలో కొత్తపార్టీ. ఇందుకు సంబంధించి ప్లీనరీలో సంచలన ప్రకటన చేస్తారన్నది సారాంశం. ఈ న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది. ముఖ్యంగా కేసీఆర్ ఫ్యాన్స్ ఈ మెస్సేజీని వైరల్ చేస్తున్నారు. రేపు ప్లీనరీ అనగా.. ఇలాంటి వార్త సోషల్ మీడియాలో సంచలనం కావడం తీవ్ర చర్చకు దారితీస్తోంది. అదీ..కేసీ ఆర్ ఫ్యాన్స్ దీనిని కావాలని ఫార్వర్డ్ చేయడం మరో అంశం. దాంతో పాటు పలు ఇంగ్లిష్ దినపత్రికల్లోనూ ప్రత్యేక కథనాలు కూడా వెలువడ్డాయి.
పార్టీ పెడతారా.. పెట్టరా.. థర్డ్ ఫ్రంట్ పోయిందా.. అటకెక్కినట్లేనా.. వంటి వివాదాలను, విమర్శలను పక్కన పెడితే.. కేసీఆర్ కొత్త పార్టీ పెడుతానని ప్రకటిస్తే పెను సంచలనమే కానుందని విశ్లేషకులు అంటున్నారు. ప్రస్తుతమున్న జాతీయ పార్టీలన్నీ ఉత్తరాది కేంద్రంగా పురుడుపోసుకుని.. ఉత్తరాది నేతల చెప్పుచేతల్లో నడుస్తున్నావనడంలో ఎలాంటి సందేహం లేదు. దక్షిణాదివారికి చోటు దక్కినా.. వారికి లభించే ప్రాధాన్యం అంతంతే. అది కాంగ్రెస్ అయినా.. బీజేపీ అయినా. ఇందుకు ఇతర కమ్యూనిస్టు పార్టీలు కూడా మినహాయింపు కాదు.
అదే సమయంలో ఢిల్లీలో దక్షిణాదివారికి ఎలాంటి ట్రీట్ మెంట్ లభిస్తుందో అందరికీ తెలుసు. పార్లమెంట్ వేదికగా కూడా దక్షిణాది భాషలకు తగిన ప్రాధాన్యం లభించని సందర్భాలు ఉన్నాయి. గతంలో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ గా పని చేసిన వ్యక్తి మీరు తమిళంలో మాట్లాడితే ఎలా? అది మీకే అర్థమవుతుంది. మాకయితే అర్థం కాదు అన్న వ్యాఖ్యలు కూడా చేశారు.
ఇక.. దక్షిణాదికి వలస వచ్చి ఇక్కడ ఉపాధి పొందుతున్న గుజరాతీలు, రాజస్థానీలు కూడా ఇక్కడి వారిపట్ల ఏహ్య భావాన్నే చూపిస్తుంటారు. తమ సంస్కృతియే గొప్ప.. మా ఆచారాలు గొప్ప అన్నట్లుగా ఫోజు కొడుతుంటారు. మనదగ్గర మనల్నే ద్వితీయ శ్రేణి పౌరులుగా పరిగణిస్తుంటారు. అదే కన్నడ, మరాఠీ, ఒడిశా, బిహారీల్లో మాత్రం ఈ పెద్దరికం భావనం మచ్చుకైనా కనిపించదు. ఇక్కడి వారితో వారు కలిసిపోయి జీవిస్తుంటారు.
ఇక ఉత్తరాది రాజకీయ నాయకుల వైఖరి కూడా ఇలాగే ఉంటుంది. మద్రాసీలా..? ఆంధ్రావాలానా..? కేరళీయులా.. కోప్రా ఖానేవాలాహైనా అంటూ ఎగతాళిగా వ్యాఖ్యానిస్తుంటారు. కొద్దిరోజుల క్రితం హిందీ భాష విషయంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను పలువురు ఈ కోణంలోనే విమర్శించారు. తమ భాషల జోలికి వస్తే ఊరుకునేది లేదంటూ తీవ్రస్థాయిలో హెచ్చరికలు చేశారు కూడా.
ఈ వివక్షను పక్కన పెడితే.. కేసీఆర్ కొత్త పార్టీ పెడితే ఉంటుందా? పోతుందా? అందులో చేరేదెవరు? ఉండేదెవరు? వంటి విమర్శలు ఉండనే ఉంటాయి. వాటికి కాలమే సమాధానం చెబుతుంది. వీటినన్నంటినీ పక్కన పెడితే.. దక్షిణాది వ్యక్తి.. తెలుగు వ్యక్తి.. తెలంగాణ వ్యక్తి.. జాతీయ పార్టీ పెట్టడం అంటే గొప్ప విషయమే కదా. ఇక్కడి వారికి గర్వకారణమే. దేశానికి మరోసారి దక్షిణాది సత్తా తెలిసిరావడం ఖాయం.