ఏపీలో రాజకీయాలు మొదలుపెట్టిన కేసీఆర్…అక్కడ నిదానంగా తన వ్యూహాలని అమలు చేసే దిశగా ముందుకెళుతున్నారు. బీఆర్ఎస్ పార్టీని ఏపీలో కూడా విస్తరించడంలో భాగంగా..అక్కడ కొందరు నేతలని బీఆర్ఎస్ లో చేర్చుకున్న విషయం తెలిసిందే. ఇదే క్రమంలో జనసేనకు చెందిన కీలక నేత తోట చంద్రశేఖర్‌ని బీఆర్ఎస్ లో చేర్చుకుని..ఏపీ బీఆర్ఎస్ శాఖకు అధ్యక్షుడుగా నియమించారు. అటు రావెల కిషోర్ బాబు, చింతల పార్థసారథి లాంటి వారిని పార్టీలో చేర్చుకున్నారు.
అయితే కాపు వర్గాన్ని టార్గెట్ చేసి..ఆ వర్గంకు చెందిన నాయకులని బీఆర్ఎస్ లోకి లాగుతున్నారు. ఇలా కాపు వర్గాన్ని టార్గెట్ చేసి..పరోక్షంగా జనసేనకు నష్టం చేయాలని కేసీఆర్ చూస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. అదే సమయంలో జనసేనతో టీడీపీ పొత్తు పెట్టుకునే ఛాన్స్ ఉంది కాబట్టి..అటు టీడీపీకి కూడా ఇబ్బందే అని విశ్లేషణలు వస్తున్నాయి. అంటే ఏపీలో కేసీఆర్ ఎంట్రీ వల్ల చంద్రబాబు-పవన్‌కు నష్టమని అంటున్నారు.
ఇదే విషయాన్ని బీజేపీ, జనసేన నేతలు కూడా మాట్లాడుతున్నారు. పవన్‌కు ఎక్కువ నష్టం చేయడానికి కేసీఆర్ చూస్తున్నారని విమర్శిస్తున్నారు. ఇదే సమయంలో తాజాగా ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్..మూడు రాజధానులపై స్పందించారు..ప్రజల స్టాండ్ ఏదైతే తమదే అదే స్టాండ్ అని చెబుతూనే…మూడు రాజధానుల అవసరం లేదని చెబుతూ..అమరావతి రాజధానిగా కొనసాగాలని కోరారు.
అయితే ఈ నిర్ణయంతో జగన్‌కు కేసీఆర్ షాక్ ఇచ్చారని కథనాలు వస్తున్నాయి గాని…ఇది పరోక్షంగా చంద్రబాబుకు షాక్ అని అర్ధమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు అమరావతికి మద్ధతు తెలపడం వల్ల..టీడీపీకి అనుకూలంగా ఉండే కొంతమంది ఓట్లు బీఆర్ఎస్ పార్టీకి పడే అవకాశాలు ఉన్నాయని. అప్పుడు ఆటోమేటిక్ గా టీడీపీ ఓట్లు చీలిపోతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.