సాగర్ ఉప ఎన్నిక అభ్యర్ధి పై కేసీఆర్ ప్యూహత్మక మౌనం

-

నాగార్జునసాగర్ ఉపఎన్నికతో నల్గొండ జిల్లా రాజకీయం హీటెక్కింది. సాగర్‌లో గెలుపు కోసం ప్రధాన పార్టీలన్ని ఎవరి ప్యూహాల్లో వారు ఉండగా హాలియాలో బహిరంగసభతో ఎన్నికల శంఖారావం పూరించారు సీఎం కేసీఆర్. ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపనతో భారీ బహిరంగసభ నిర్వహించారు. ప్రతిపక్షాల పై ఓ రేంజ్ లో ఫైర్ అయిన కేసీఆర్ అభ్యర్ధి విషయంలో మాత్రం ప్యూహత్మక మౌనం పాటించారు.

సాగర్ ఉప ఎన్నిక వేళ భారీ బహిరంగసభతో స్పీడు పెంచింది టీఆర్ఎస్. చిన్న చితక 13 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన సీఎం కేసీఆర్ భారీ స్థాయిలో జనసమీకరణ చేసిన హాలియాలో సభలో పాల్గొన్నారు. ఇదే ఊపులో అభ్యర్ధి పై కూడా కేసీఆర్ క్లారిటీ ఇస్తారన్న చర్చ నిన్నటినుంచే ఊపందుకుంది. అయితే ప్రాజెక్టులు పూర్తి చేయకుండా ఓట్లడగమన్న కేసీఆర్ అభ్యర్ధి విషయంలో మాత్రం మౌనం పాటించారు.

నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున ఎవరిని బరిలోకి దింపుతారనే అంశంపై సస్పెన్స్ నెలకొంది. ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మరణంతో ఖాళీ అయిన ఈ స్థానం నుంచి ఆయన కుటుంబసభ్యులను పోటీ దింపుతారా లేక కొత్త నేతను తెరపైకి తీసుకొస్తారా అన్నది ఇంకా క్లారిటీ లేదు. అయితే ఈరోజు జరిగిన బహిరంగ సభలో అభ్యర్ధి విషయంలో స్పష్టత ఇవ్వకపోవడంతో దీనిపై టీఆర్ఎస్ శ్రేణుల్లో మరింత టెన్షన్ నెలకొంది.

గత పార్లమెంట్ ఎన్నికల సమయంలో నల్గొండ నుంచి అనూహ్యంగా కొత్త అభ్యర్ధి తెరపైకి వచ్చారు..అలాంటి అన్యూహ్య నిర్ణయాలు సాగర్ ఉపఎన్నికలో ఉంటాయా అన్న చర్చ సైతం టీఆర్ఎస్ శ్రేణుల్లో నడుస్తుంది. అయితే దుబ్బాకలో తగిలిన ఎదురుదెబ్బతో అలాంటి నిర్ణయాల వైపు కేసీఆర్ మొగ్గు చూపడని తెలుస్తుంది. కాంగ్రెస్ నుంచి సీనియర్ నేత జానారెడ్డి బరిలో ఉండటంతో ఆయనకు తగ్గ సీనియర్ నేతనే రంగంలో దించే ఆలోచనలో ఉన్నారట గులాబీ దళపతి.ఎమ్మెల్సీ చిన్నపరెడ్డి,మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిలో ఒకరు సాగర్ లో టీఆర్ఎస్ అభ్యర్ధిగా ఉండే అవకాశం ఉంది. బీజేపీ కూడా అభ్యర్ధి విషయంలో ఓ నిర్ణయానికి రాకపోవడంతో ఎన్నికల నోటిఫికేషన్ వరకు వేచి చూసే ధోరణిలో కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తుంది. రాజకీయ పరిస్థితిని బట్టి గుత్తా,చిన్నపరెడ్డిలో ఒకరు అభ్యర్దిగా ఉండే అవకాశం ఉంది.

ఉపఎన్నికలు అంటేనే రెట్టించిన ఉత్సాహంతో పని చేసే టీఆర్ఎస్.. తమ సిట్టింగ్ స్థానాన్ని చేజారకుండా చూడటం కోసం ఈ స్థాయిలో పోటీని ఎదుర్కోవడం ఇదే తొలిసారి. తన మాటలు, వ్యూహాలతో ప్రత్యర్థులను డిఫెన్స్‌లో పడేసే సీఎం కేసీఆర్ ఈరోజు సాగర్ పర్యటన అభ్యర్ధి విషయంలో కొంత క్లారిటీ ఉన్నా ప్యూహత్మక మౌనం పాటించినట్లు తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version