అమెరికా అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ చేసిన ఓ ట్వీట్‌పై ఢిల్లీ మాజీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. ఎన్నికల్లో ఉచితాలు (ఫ్రీ బీస్) ఇచ్చే ఒరవడి అగ్రరాజ్యం అమెరికాకూ చేరిందని ట్వీట్ చేశారు. తనను గెలిపిస్తే 12 నెలల్లో కరెంట్ ధరను సగానికి తగ్గిస్తానని డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన హామీని కేజ్రీవాల్ కోట్ చేశారు. విద్యుత్ రేట్లు సగం తగ్గిస్తానని ట్రంప్ హామీ ఇచ్చాడని, ఉచితాల పథకాలు అమెరికా వరకూ చేరాయని కేజ్రీవాల్ పేర్కొన్నారు.
200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, తాగునీరు, మహిళలకు ఉచిత బస్సు రవాణా వంటి పథకాలను ఢిల్లీ ప్రభుత్వం అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఉచితాలతో ప్రభుత్వ ఖజానాపై ఆప్ సర్కార్ భారం వేస్తోందని ప్రతిపక్షాలు విమర్శలు చేశాయి. ఢిల్లీ ఎన్నికలు వచ్చే ఏడాది ఆరంభంలో జరగనున్నాయి. ఈ తరుణంలో డొనాల్డ్ ట్రంప్ ట్వీట్‌ను ఆప్ తమకు అనుకూలంగా వాడుకుంటున్నది.కేజ్రీవాల్ పాలనకు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ లభిస్తున్నదని ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా ట్వీట్ చేశారు.