మొయినాబాద్‌ ఫామ్‌హౌజ్‌ కేసులో కేరళ వైద్యుడి ప్రమేయం

-

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకు ఎర కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ కొనసాగుతోంది. నిందితులు రామచంద్రభారతి, సింహయాజి, నందకుమార్‌ల ఇళ్లు, కార్యాలయాలు, వ్యాపారసంస్థలు, ఆశ్రమాల్లో రెండ్రోజులుగా తనిఖీలు నిర్వహించారు. ఏడు బృందాలుగా ఏర్పడిన అధికారులు శనివారం నుంచి నిన్న రాత్రి వరకు సోదాలు జరిపారు. కీలక నిందితుడు రామచంద్రభారతికి సంబంధించి హరియాణాలోని ఫరీదాబాద్‌ నివాసంతో పాటు కర్ణాటకలోని పుత్తూరులో పోలీసులు తనిఖీలు చేశారు. తిరుపతికి చెందిన మరో నిందితుడు సింహయాజి ఆశ్రమంలోనూ తనిఖీలు కొనసాగాయి. సింహయాజిని ప్రముఖ స్వామీజీగా పేర్కొంటూ పలువురు రాజకీయ ప్రముఖులకు నందకుమార్‌ పరిచయంచేసినట్లు పోలీసులు గుర్తించారు.

ఎమ్మెల్యేలతో మాట్లాడే క్రమంలో కేరళకు చెందిన తుషార్‌తో రామచంద్రభారతి ఫోన్‌లో మాట్లాడించారు. ప్రలోభాల పర్వంలో తుషార్‌ పాత్ర ఏంటనే అంశంపై పోలీసులు ఆరా తీస్తుండగానే కొత్తగా మరో పేరు తెర మీదకు వచ్చింది. కేరళకు చెందిన ప్రముఖ వైద్యుడి ప్రమేయాన్ని పోలీసులు గుర్తించారు. ఆధ్యాత్మిక నేపథ్యం ఉన్న ఆ వైద్యుడే తుషార్‌ను రామచంద్రభారతికి పరిచయం చేసి ఉంటాడని భావించిన సిట్‌ బృందం.. కేరళల పోలీసుల సహకారంతో వైద్యుడి ఆశ్రమానికి వెళ్లారు. ఆశ్రమంలోని పర్యవేక్షకుడి నుంచి వైద్యుడికి సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు.

వైద్యుడి ఇంటి చిరునామా కనుక్కున్న పోలీసులు అతడి నివాసానికి వెళ్లారు. ఇంటికి పోలీసులు వస్తున్నట్లు ముందుగానే ఆశ్రమ పర్యవేక్షకుడు సమాచారం ఇవ్వటంతో అప్పటికే వైద్యుడు ఇంటి నుంచి పరారయ్యాడు. కేరళ పోలీసుల సాయంతో ఆశ్రమ పర్యవేక్షకుడిని అదుపులోకి తీసుకున్న సిట్ అధికారులు పరారైన వైద్యుడి కోసం గాలిస్తున్నారు. వైద్యుడు పట్టుబడితే ఈ కేసులో కీలక సమాచారం వెలుగులోకి వచ్చే అవకాశమున్నట్లు భావిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version