తెలంగాణలోని గ్రామ పంచాయతీల అభివృద్ధికి కేరళ మోడల్‌ను అమలు చేయనున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు.ఈ క్రమంలోనే మంగళవారం క్రిస్ప్ (CRISP) సంస్థ మెంబర్ సెక్రటరీ, రిటైర్డ్ ఐఏఎస్ ఆర్.సుబ్రహ్మణ్యంతో ఆమె సచివాలయంలో భేటీ అయ్యారు. ఈ సందర్బంగా తమ సంస్థ కార్యకలాపాలను పీపీపీ ద్వారా మంత్రికి క్రిస్ప్ మెంబర్ సుబ్రహ్మణ్యం వివరించారు. ఆయా రాష్ట్రాలు, వివిధ రంగాల్లో తీసుకొచ్చిన సంస్కరణలు, తద్వారా సాధించిన పురోగతిని మంత్రికి నివేదించారు.
కేరళ మాజీ సీఎస్ విజయానంద్ అధ్యక్షతన 10 మంది సీనియర్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారుల ఆధ్వర్యంలో ‘క్రిస్ప్’ సంస్థ పని చేస్తున్నట్లు పేర్కొన్నారు. కేరళ గ్రామ పంచాయతీల బలోపేతానికి విజయానంద్ కృషి చేసినట్లు మంత్రి చెప్పారు. ఆయన అనుభవంతో రాష్ట్రంలోని గ్రామపంచాయతీల బలోపేతం, గ్రామాల అభివృద్ధికి కొత్త సంస్కరణలు తీసుకొస్తామన్నారు.