హుజూరాబాద్ లో గెలుపు బీజేపీది కాదని… ఈ విజయం ప్రజలదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ప్రజలు నీతికి, న్యాయానికి మద్దతుగా నిలిచారన్నారు. హుజూరాబాద్ లో బీజేపీకి మద్దతు ఇచ్చిన హుజురాబాద్ ప్రజానికానికి ధన్యవాదాలు తెలియజేశారు. హుజూరాబాద్లో ప్రజలు చరిత్రను తిరగరాశారని అభిప్రాయపడ్డారు. డబ్బుతో గెలవాలని చూసినా.. వాటిని లెక్కచేయకుండా ప్రజలు బీజేపీని గెలిపించారన్నారు. తన 40 ఏళ్లలో ఈ తరహా ఎన్నికలు ఎప్పుడూ చూడలేదని ఆయన తెలిపారు. హుజూరాబాద్ ఎన్నికల కోసం టీఆర్ఎస్ పార్టీ వేలాది కోట్ల ప్రాజెక్ట్ లు ప్రారంభించింది. పథకాల ద్వారా ప్రజల్ని మభ్యపెట్టాలని చూసిందన్నారు. ధర్మం, నీతి నిజాయితీకి ప్రజలు పట్టం కట్టారన్నారు. ప్రజలు అబద్దాలను ఎప్పుడూ నమ్మరని అన్నారు.
కాంగ్రెస్ పార్టీతో టీఆర్ఎస్ పార్టీకే పొత్తు ఉందని విమర్శించారు. హుజూరాబాద్ లో టీఆర్ఎస్, బీజేపీ ఖర్చుకు పొంతనే లేదని అన్నారు. హుజూరాబాద్ హీరోలు ఈటెల రాజేందర్, ప్రజలే అని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని కిషన్ రెడ్డి వెల్లడించారు. రానున్న రోజల్లో నాయకులు బీజేపీలకు వలసలు కడుతారని జోస్యం చెప్పాడు. బీజేపీ సిద్దాంతాలను నమ్మి వచ్చే వారికి అన్ని విధాలుగా సహకరిస్తామని కేంద్రమంత్రి వెల్లడించారు.