హైదరాబాద్ జంట నగరాలలో రాబోయే రెండు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపధ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కోరారు. గత రెండు రోజులుగా తెలంగాణాలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది కాబట్టి రాష్ట్ర రాజధాని పౌరులు, ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో, బస్తీల్లో నివాసముండే వారు చాలా అప్రమత్తంగా ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
ముఖ్యంగా మ్యాన్ హోల్స్, నాలాలలో వర్షం నీరు తీవ్రంగా ప్రవహించే ప్రమాదం ఉన్న ప్రాంతాలలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నానని ఆయన అన్నారు. ఈ సందర్భంగా స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలు, వివిధ బస్తీ లకు చెందిన యువత చురుగ్గా, అప్రమత్తంగా ఉండాలని అన్నారు. హైదరాబాద్, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలలో వర్షం వల్ల ఏర్పడిన ప్రమాద పరిస్థితులను సమర్ధవంతంగా అధిగమించాలని అన్నారు. అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని ఆయన కోరారు. కేంద్ర బృందాలను, పారామిలిటరీని పంపించటానికి ఏర్పాట్లు చేస్తున్నానని ఆయన అన్నారు.