కేరళలోని కొచ్చిలో ఉన్న అలువా రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులు స్థానికంగా ఉన్న చెట్లను నరకమంటున్నారు. రైల్వే స్టేషన్ పార్కింగ్ లాట్‌లో ఉన్న చెట్లపై పక్షులు వాలకుండా ఉండేందుకు గాను చెట్లనే నరికివేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా ఓ వైపు చెట్లను నాటండి.. పర్యావరణాన్ని కాపాడండి.. అంటూ జనాలు గళమెత్తుతుంటే.. మరోవైపు కేరళలోని కొచ్చి ప్రాంత వాసులు మాత్రం ఉన్న చెట్లను నరకమంటున్నారు. అవును, మీరు విన్నది నిజమే. అయితే వారికి పర్యావరణం పట్ల ప్రేమ లేదా.. ఎందుకు అలా చెట్లను నరకమంటున్నారు..? అని మీరనుకోవచ్చు. కానీ వారు చెట్లను నరకమనేందుకు ఓ కారణం ఉంది.. అదేమిటంటే…
కేరళలోని కొచ్చిలో ఉన్న అలువా రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులు స్థానికంగా ఉన్న చెట్లను నరకమంటున్నారు. ఎందుకంటే.. వారు రైల్వే స్టేషన్‌లో ఉన్న పార్కింగ్‌లో వాహనాలను ఉంచి పనులు పూర్తి చేసుకుని తిరిగి వచ్చి.. వాహనాలను తీద్దామని చూస్తే.. వాటిపై ఎక్కడ చూసినా.. సందు లేకుండా.. పిట్ట రెట్టలే ఉంటున్నాయి. దీంతో వాహనాలు ఛండాలంగా కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో వాహనాలను శుభ్రం చేసుకోవడం నిత్యం ప్రయాణికులకు తలకు మించిన భారంగా మారుతోంది.
కాగా తమ వాహనాలపై పక్షులు రెట్టలు వేస్తున్నందున తమకు నిత్యం వాహనాలను శుభ్రం చేసుకునేందుకే సమయమంతా గడిచిపోతుందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో రైల్వే స్టేషన్ పార్కింగ్ లాట్‌లో ఉన్న చెట్లపై పక్షులు వాలకుండా ఉండేందుకు గాను చెట్లనే నరికివేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. అయితే దీనిపై రైల్వే అధికారులు స్పందిస్తూ.. చెట్లు ఉండడం వల్ల పర్యావరణానికి మేలు జరుగుతుందని, వాటిని నరికేస్తే కాలుష్యం పెరుగుతుందని, జీవవైవిధ్యం దెబ్బతినడం ఇష్టం లేకే చెట్లను నరికించడం లేదని అంటున్నారు. మరి దీనిపై ప్రయాణికులు ఏమంటారో చూడాలి. ఏది ఏమైనా.. ఆ రైల్వే స్టేషన్‌కు వెళ్లే వాహనదారులు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు..!