మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పరిస్థితి దారుణంగా తయారైందా ? అధికార పార్టీ నేతల దూకుడుతో ఆయన ఉక్కిరిబిక్కిరికి గురవుతున్నారా? ఈ సమయంలో ఆయనను సమర్ధించే నాయకులు ఎవరూ టీడీపీలో కనిపించడం లేదా ? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. గడిచిన రెండు రోజులుగా దేవినేని టార్గెట్‌గా వైసీపీ నాయకులు విజృంభించారు. వారిద్దరు కూడా ఉమా సామాజిక వర్గానికే చెందిన నేతలు కావడం విశేషం. ఒకరు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అయితే, మరొకరు మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని. వీరిద్దరూ కూడా దేవినేనికి కంట్లో నలుసుల్లా మారి.. కారం పోసినంత పనిచేశారని రాజకీయ వర్గాల్లో చర్చకు వచ్చింది.
మంత్రి నాని ఏకంగా.. దేవినేని పరువును అడ్డంగా తీసేశారు. నువ్వు సోడాలు కొట్టుకునే కుటుంబంలోనుంచి వచ్చావు. నీ బతుకు ఎవరికి తెలియదు అంటూ.. నాని చేసిన వ్యాఖ్యలు దేవినేని ఇమేజ్‌ను పూర్తిగా డ్యామేజ్ చేశాయి. ఇక, మైలవరం ఎమ్మెల్యే కేపీ కూడా ఇదే రేంజ్‌లో దేవినేనిపై విరుచుకుపడ్డారు. తనపై ఉమా చేసిన విమర్శలను తీవ్రంగా తీసుకున్న కేపీ.. తాను అక్రమ మైనింగ్‌కు పాల్పడి ఉంటే.. సీబీఐ విచారణకు సిద్ధమన్నారు. దేవినేని ఉమా పోలవరం నిధులు దోచేశాడని.. దానిపై కూడా విచారణకు ఆదేశించేలా ఇద్దరం కలిసి అడుగుదామని, మరి తన డిమాండ్‌కు దేవినేని సిద్ధమా ? అని ప్రశ్నించడం ఇప్పుడు దేవినేని ఉమాను సంకటంలోకి నెట్టేసింది.
చిత్రం ఏంటంటే.. ముగ్గురూ కూడా ఒకే సామాజిక వర్గానికి చెందినవారుకావడం. నిజానికి ఉమాపై కొడాలి నాని వ్యాఖ్యలు ఈ రేంజ్లో ఉంటాయని ఎవరూ ఊహించలేదు. ఉమా అనుచరులు కూడా ఎవరూ ఈ రేంజ్‌లో నాని విరుచుకుపడతారని అనుకోలేదు. కానీ, నాని విజృంభించడంతో ఇప్పుడు ఉమా తలెత్తుకోలేని పరిస్థితి ఏర్పడింది. పైగా.. ఇంత వరకు ఉమా కుటుంబం గురించి తెలియనివారికి కూడా నిజాలు తెలిసిపోవడం మరింతగా ఆయనకు ఇబ్బందికర పరిస్థితిని కల్పించింది. ఇక, సీబీఐ విచారణకు సవాల్ రువ్విన కేపీ.. కూడా ఉమా నోరు మూయించారనే వాదన వినిపిస్తోంది. దీంతో ఇకపై ఉమా రాజకీయంగా ఎలాంటి వ్యాఖ్యలుచేసినా.. ఈ ఇద్దరు తగులుకోవడం ఖాయమని అంటున్నారు. మరి మున్ముందు ఏం జరుగుతుందో చూడాలి.
-vuyyuru subhash