ప్రజాసంక్షేమ,అభివృద్ధి పథకాల అమలు విషయంలో ఉద్యోగులు తమకు ఇష్టం వచ్చినట్లు నిర్ణయాలు తీసుకుని ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకు రావొద్దని , అలా చేస్తే కఠినచర్యలు తప్పవని రాష్ట్ర పంచాయతీ రాజ్,గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క హెచ్చరించారు. శుక్రవారం పంచాయతీ రాజ్,గ్రామీణాభివృద్ధి శాఖలో ఉద్యోగుల ఆన్‌లైన్ గ్రీవెన్స్ మీటింగుకు మంత్రి వర్చువల్‌గా హాజరయ్యారు.
ములుగు పర్యటనకు వెళ్తున్న మంత్రి సీతక్క తన ప్రయాణంలోనే ఉద్యోగుల సర్వీస్ సమస్యలను విన్నారు.పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలోని ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి వినూత్న పద్ధతిని అవలంభిస్తున్నామని మంత్రి వివరించారు. వ్యక్తిగతంగా మీరు సచివాలయం చుట్టూ తిరగకుండానే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలిపారు. శాఖ స్థాయిలోని నిర్ణయాలను వెంటనే తీసుకుంటామని..మంత్రివర్గం,పైస్థాయిలో పరిష్కారం కావాల్సిన సమస్యల పరిష్కరానికి కృషి చేస్తామన్నారు.