గతంలో ఏ ముఖ్యమంత్రి చేయనివిధంగా గోదావరి వరద ప్రాంతంలో పునరావాసం ఏర్పాటు చేశారని వ్యాఖ్యానించారు మాజీ మంత్రి కొడాలి నాని. తాజాగా ఆయన మాట్లాడుతూ.. బాధితులకు ఆహారం ,నీరు అందించడం సహా కుటుంబానికి 2 వేలు ఇచ్చారని, వరద ప్రాంతాల్లో దెబ్బతిన్న రోడ్లు మరమ్మతులు చేయాలని సీఎం ఆదేశించారని తెలిపారు మాజీ మంత్రి కొడాలి నాని. ఒక్కో కలెక్టర్ కు 6-8కోట్లు కేటాయించి సహాయ కార్యక్రమాలు చేయాలని సీఎం ఆదేశించారని, గతంలో అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకు పోయినప్పుడూ ప్రభుత్వం పై టీడీపీ నేతలు ఇలాగే ఆరోపణలు చేశారని కొడాలి నాని మండిపడ్డారు. అంతేకాకుండా.. స్వయంగా సీఎం వెళ్లి సమస్యలు పరిష్కరించారని, గోదావరి వరద బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలా సాయం చేస్తుందని కొడాలి నాని తెలిపారు. త్వరలో సీఎం జగన్ గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తారని వరద బాధితులకు ఊరట కలిగించే విషయం తెలిపారు కొడాలి నాని.
గ్రామాల్లో తిరిగి సమస్యలు, లోటు పాట్లు తెలుసుకుని వెంటనే సమస్యలను పరిష్కరిస్తారని, భారత దేశంలో 10-20 శాతం రోడ్ల గోతులు సహజంగానే ఉంటాయన్నారు. ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టినా రోడ్లు పోయేవి పోతుంటాయి, వేసేవి వేస్తుంటారు. రోడ్ల పై పవన్ కళ్యాణ్ గుడ్ మార్నింగ్ సీఎం కార్యక్రమం చేపట్టారు. పవన్ కళ్యాణ్ ఏ రాష్ట్రానికైనా వెళదాం …10 శాతం రోడ్లు కచ్చితంగా దెబ్బతిని ఉంటాయి.. చూపిస్తాం. ఇతర రాష్ట్రాల్లో రోడ్ల పై గోతులు లేవని నిరూపిస్తే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా. సీఎంను కూడా రాజకీయాల నుంచి తప్పుకోవాలని కోరతా.. నిరూపించ లేపోతే పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్ రాజకీయాల నుంచి తప్పుకుంటారా? హైదరాబాద్ లోనూ జర్నలిస్ట్ కాలనీ సహా పలు చోట్ల రోడ్లు గోతులు పడ్డాయి. హైదరాబాద్ – విజయవాడ హైవే పైనా గోతులు దర్శనమిస్తాయి. రాష్ట్రంలో రోడ్ల పై విమర్శించే వారికి ఇతర రాష్ట్రాల్లో రోడ్ల దుస్థితి కనిపించదా? అని కొడాలి నాని ధ్వజమెత్తారు.