జల యుద్ధం…రెచ్చగొట్టేలా మాట్లాడితే లాభం ఉండదు

-

కృష్ణా నదీ జలాలకు సంబంధించి తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం ముదురుతుంది. దీంతో ఇరు రాష్ట్రాల నేతలు ఈ వివాదంపై తమ అభిప్రాయలను వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈ విషయంపై తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం స్పందించారు. ప్రొఫెసర్ జయశంకర్ మానవ వనరుల అభివృద్ధి కేంద్రం, పాలమూరు అధ్యయన వేదిక, తెలంగాణ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో కృష్ణా నదీ జలాలు – తెలంగాణ ప్రభుత్వ విధానం అనే అంశంపై జరిగిన వెబినార్ లో కోదండరాం మాట్లాడారు.

కేసీఆర్ ఉద్యమ లక్ష్యాలు పక్కన పెట్టి, కేవలం తన ప్రయోజనాలు, కాంట్రాక్టర్ల ప్రయోజనాలు, జగన్ కు నెరవేరే ప్రయోజనాలు కోసమే పని చేస్తున్నారే తప్ప కేసీఆర్ కు తెలంగాణ ప్రజలకు బాధ్యత పడడం లేదని ఆరోపించారు. కృష్ణా నది మీద పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయకుండా ప్రజాద్రోహానికి పాల్పడింది కేసీఆర్ ప్రభుత్వమేనని ధ్వజమెత్తారు. మొత్తం 811 టీఎంసీలలో మనకు కేవలం 299 టీఎంసీలు (37%) మాత్రమే చాలు అని స్వయంగా ముఖ్యమంత్రి అనడం శోచనీయని, మన న్యాయమైన వాటా మనకు దక్కాలని దానిని మనం సాధించుకోవాలని అన్నారు.

ఈ సందర్భంగా కోదండరాం తెలంగాణ ప్రభుత్వం ముందు నాలుగు డిమాండ్లు ఉంచారు. కృష్ణాలో న్యాయసమ్మతమైన వాటా దక్కించుకునేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషిచేయాలని అన్నారు. కృష్ణా నదిపై పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలని దాని కోసం అవసరమైన కేటాయింపులు చేయాలని డిమాండ్ చేసారు. జూరాలపై మరొక ఎత్తిపోతల ప్రాజెక్టు ప్రారంభించి దానిని త్వరితగతిన ముగించాలన్నారు. అలానే తెలంగాణ ప్రభుత్వం నీటిపారుదల ప్రాజెక్టుల మీద ఇప్పటికి పెట్టిన మొత్తం ఖర్చు ఎంత, సాగులోకి వచ్చిన ఆయకట్టు ఎంత స్పష్టం చేయాలని డిమాండ్ చేసారు. ఈ డిమాండ్లు నెరవేర్చకుండా, భావోద్వేగాలు రెచ్చగొట్టేలా కేసీఆర్, మంత్రులు మాట్లాడితే ప్రజలకు ఎలాంటి లాభం లేదన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version