కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో ఐపీఎల్ 14వ సీజన్ అర్ధాంతరంగా నిలిచిపోయిన విషయం తెల్సిందే. అయితే టోర్నీలో 29 మ్యాచులే జరగగా మిగిలిన మ్యాచ్ లను సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 15 వరకు యూఏఈలో నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. కాగా ఐపీఎల్ రెండో దశ మ్యాచ్ లకు టోర్నీలో పాల్గొనే విదేశీ ఆటగాళ్లు అందరూ అందుబాటులో ఉండే అవకాశం లేదు.ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ దేశాలకు ద్వైపాక్షిక సిరీసులు ఉండడంతో ఆటగాళ్ళను సదరు బోర్డులు ఐపీఎల్‌లో ఆడేందుకు వెళ్ళడానికి అనుమతి ఇవ్వడం లేదు.
దీంతో వీలైనంత మంది విదేశీ ఆటగాళ్ళు టోర్నీలో పాల్గొనేందుకు బీసీసీఐ ప్రయత్నాలు చేస్తుంది. ఇందులో భాగంగానే ఇటీవలే వెస్టిండీస్ క్రికెటర్లను రప్పించేందుకు బీసీసీఐ చేసిన ప్రయత్నం ఫలించింది. ఐపీఎల్ నేపథ్యంలో కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్)ను కొన్నిరోజులు ముందే నిర్వహించాలని బీసీసీఐ కోరగా… బీసీసీఐ అభ్యర్ధనను విండీస్ అంగీకరించింది. దీంతో ఐపీఎల్ రెండో దశ మ్యాచ్ లు ఆడేందుకు విండీస్ ఆటగాళ్ళకు మార్గం సుగమం అయింది.
ఇక తాజాగా న్యూజిలాండ్ ఆటగాళ్ళకు కూడా ఐపీఎల్ రెండో దశ మ్యాచ్ లు ఆడేందుకులైన్ క్లియర్ అయినట్టు తెలుస్తోంది. ఐపీఎల్‌లో ఆడటానికి న్యూజీలాండ్ క్రికెట్ బోర్డు తమ ఆటగాళ్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఐపీఎల్ ఆడాలో అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాలో ఆటగాళ్ల ఇష్టానికే వదిలేస్తున్నట్లు కివీస్ క్రికెట్ బోర్డు తెలిపింది. దీంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్ కేన్ విలియమ్సన్ సహా ట్రెంట్ బౌల్ట్, కైల్ జామిసన్ ఆడమ్ మిల్నే, లాకీ ఫెర్గూసన్, జేమ్స్ నీషామ్, మిచెల్ సాంట్నర్,ఫిన్ అలెన్ తదితర ఆటగాళ్ళు ఐపీఎల్‌లో ఆడే అవకాశం ఉంది.