డబ్బు కోసమే కొడంగల్ బాలుడి కిడ్నాప్.. కానీ..!

-

వికారాబాద్ జిల్లా కొడంగల్​లో బాలుడి కిడ్నాప్ కథ విషాదాంతమైంది. ఈ ఘటనకు సంబంధించి కీలక విషయాలను ఎస్పీ కోటి రెడ్డి వెల్లడించారు. పసివాడిని కిడ్నాప్ చేసిన యువకుడు తల్లిదండ్రుల నుంచి డబ్బు డిమాండ్ చేయాలనుకున్నాడని ఎస్పీ తెలిపారు. ఆ ప్లాన్ ఫెయిల్ అవ్వడంతో ఆ బాలుడిని కిరాతకంగా హత్య చేశాడని వెల్లడించారు.

“కొడంగల్ పట్టణంలోని అంబేడ్కర్‌ కాలనీకి చెందిన అజయ్‌ (19) జులాయిగా తిరుగుతుండేవాడు. కష్టపడకుండా డబ్బులు సంపాదించాలన్న ఉద్దేశంతో.. సమీపంలోని మిట్టిబోలి కాలనీకి చెందిన రజాఖాన్‌ (11) అనే బాలుడిని కిడ్నాప్‌ చేయాలనుకున్నాడు. బాలుడి తల్లిదండ్రులతో కొద్దిరోజులుగా స్నేహం నటిస్తూ ఆ కుటుంబానికి దగ్గరయ్యాడు. ఎవరికీ అనుమానం రాకుండా ప్రవర్తించేవాడు. ఈ క్రమంలో ఆ ఇంట్లో ఎవరూ లేని సమయంలో.. శనివారం సాయంత్రం రజాఖాన్‌ను స్కూటీపై ఎక్కించుకుని తన ఇంటికి తీసుకెళ్లాడు. కానీ ఆ యువకుడి ప్లాన్ పసిగట్టిన బాలుడు గట్టిగా అరవడంతో భయపడ్డ అజయ్ బాలుడి తలపై సుత్తితో గట్టిగా కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం శవాన్ని సూట్‌కేసులో పెట్టి అర్ధరాత్రి వేళ సమీపంలోని చెత్త ప్రదేశంలో పడేశాడు.” అని ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు.

అజయ్‌ వెంట బాలుడు వెళ్లడాన్ని చూసిన కాలనీవాసులు కొందరు పోలీసులకు సమాచారం అందించారు. ఆదివారం రాత్రి నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించగా.. డబ్బు కోసమే ఈ దారుణానికి పాల్పడినట్లు అంగీకరించాడని పోలీసులు తెలిపారు. గతంలో హైదరాబాద్‌లో రూ.25 లక్షల దొంగతనం కేసులోనూ అజయ్‌ నిందితుడని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version