అబుధాబిలో జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2020 టోర్నీ 21వ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌పై కోల్‌కతా నైట్ రైడర్స్ గెలుపొందింది. కోల్‌కతా నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో చెన్నై కొద్ది పరుగుల వరకు వచ్చి ఆగిపోయింది. ఈ క్రమంలో కోల్‌కతా జట్టు చెన్నైపై 10 పరుగుల తేడాతో గెలుపొందింది.
మ్యాచ్‌లో కోల్‌కతా జట్టు టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేపట్టింది. ఈ క్రమంలో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 167 పరుగులు చేసి ఆలౌట్ అయింది. కోల్‌కతా బ్యాట్స్‌మెన్లలో త్రిపాఠి విజృంభించాడు. 51 బంతుల్లోనే 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 81 పరుగులు చేశాడు. ఇక మిగిలిన బ్యాట్స్‌మెన్ ఎవరూ అంతగా ఆకట్టుకోలేదు. చెన్నై బౌలర్లలో బ్రేవో 3 వికెట్లు తీయగా, శామ్ కుర్రాన్, శార్దూల్ ఠాకూర్, శర్మలు తలా 2 వికెట్లు తీశారు. ఇక మరొక వికెట్ రనౌట్ రూపంలో లభించింది.
అనంతరం బ్యాటింగ్ చేపట్టిన చెన్నై 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. ఆ జట్టు బ్యాట్స్‌మెన్లలో షేన్ వాట్సన్, అంబటి రాయుడులు మాత్రమే ఆకట్టుకున్నారు. 40 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్సర్‌తో వాట్సన్ 50 పరుగులు చేయగా, అంబటి రాయుడు 27 బంతుల్లో 3 ఫోర్లతో 30 పరుగులు చేశాడు. మిగిలిన ఎవరూ చెప్పుకోదగిన ప్రదర్శన చేయలేదు. కోల్‌కతా బౌలర్లలో శివం మావి, వరుణ్, నాగర్‌కోటి, సునీల్ నరైన్, రస్సెల్‌లు తలా 1 వికెట్ చొప్పున తీశారు.