ఎప్పుడైతే రేవంత్ రెడ్డికి పిసిసి పదవి వచ్చిందో అప్పటినుంచే కాంగ్రెస్ పార్టీలో కోమటిరెడ్డి బ్రదర్స్ వైఖరి కాస్త వేరుగానే ఉందని చెప్పొచ్చు. తనకు కాకుండా రేవంత్ రెడ్డికి పిసిసి పదవి రావడంపై అప్పుడే కోమటిరెడ్డి వెంకటరెడ్డి…రేవంత్ పై తీవ్ర విమర్శలు చేశారు…డబ్బులు ఇచ్చి పదవి కొన్నారని, చంద్రబాబు రేవంత్ వెనుక ఉన్నారని, ఆయనే రేవంత్ రెడ్డికి పిసిసి పదవి ఇప్పించారని మాట్లాడారు.
అటు రాజగోపాల్ రెడ్డి సైతం…రేవంత్ రెడ్డికి యాంటీగానే మాట్లాడుతూ వచ్చారు. అలాగే ఆయన అప్పుడే బీజేపీ అగ్రనేతలతో టచ్ లోకి వెళ్లారని కథనాలు కూడా వచ్చాయి…రాష్ట్రంలో బీజేపీ బలం పెరుగుతుందని, టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం బీజేపీనే అని రాజగోపాల్ మాట్లాడారు. అయినా సరే కోమటిరెడ్డి బ్రదర్స్ కరుడుకట్టిన కాంగ్రెస్ వాదులు కాబట్టి…వారికి షోకాజ్ నోటీసులు ఇవ్వడం గాని, వారిపై కాంగ్రెస్ నేతలు విమర్శలు చేయడం గాని చేయలేదు.
కానీ వారు నిదానంగా రేవంత్ ఆధ్వర్యంలో నడిచే కాంగ్రెస్ పార్టీకి చెక్ పెట్టే విధంగా రాజకీయం నడుపుతున్నారనే సంగతి ఎవరు పసిగట్టలేకపోయారని విశ్లేషకులు అంటున్నారు. వాస్తవానికి ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీజేపీకి ఏ మాత్రం బలం లేదు…ఇక్కడ టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల హవానే ఎక్కువ. అలాంటిది కోమటిరెడ్డి బ్రదర్స్ ద్వారా నల్గొండలో బలం పుంజుకోవాలనే ప్లాన్ తో కమలం పార్టీ రాజకీయం నడిపించిందని చెప్పొచ్చు.
ముందుగానే కోమటిరెడ్డి బ్రదర్స్ చేత కాంగ్రెస్ పని అయిపోయిందని చెప్పించి…అది కూడా రేవంత్ రెడ్డి వల్లే పార్టీ నాశనమవుతుందని, అలాగే టీఆర్ఎస్ పార్టీకి బీజేపీనే ప్రత్యామ్నాయం అనేలా రాజకీయం నడిపించారని తెలుస్తోంది. అలా పార్టీని దెబ్బకొట్టకే ఇప్పుడు రాజగోపాల్ బీజేపీలో చేరడానికి సిద్ధమయ్యారని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇక తాను కాంగ్రెస్ ని వదలనని వెంకటరెడ్డి చెబుతున్నా సరే…ఆయన కూడా బీజేపీలోకి వెళ్ళడం ఖాయమని తెలుస్తోంది. మొత్తానికైతే కోమటిరెడ్డి బ్రదర్స్ పక్కా ప్లాన్ ప్రకారమే కాంగ్రెస్ పార్టీని దెబ్బకొట్టి బీజేపీలోకి వెళుతున్నారని రేవంత్ వర్గం అనుమానిస్తుంది.