తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారంతో వేడెక్కాయి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాపై రాజకీయ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. టీఆర్ఎస్ నేత, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డిపై మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నల్గొండ జిల్లా మర్రిగూడలో నిన్న విలేకరులతో మాట్లాడిన ఆయన.. గుత్తా తనపై చేస్తున్న విమర్శలకు ధీటుగా బదులిచ్చారు. కాంగ్రెస్ పార్టీ నుంచి విజయం సాధించి ఎంపీ పదవికి రాజీనామా చేయకుండానే టీఆర్ఎస్‌లో చేరిన గుత్తాకు తనను విమర్శించే అర్హత, నైతిక హక్కు లేదన్నారు.
తాను కాంట్రాక్టుల కోసం పార్టీ మారలేదన్నారు. వాటి కోసమే పార్టీ మారాలనుకుంటే ఎప్పుడో మారి ఉండేవాడినని అన్నారు రాజగోపాల్‌రెడ్డి. మునుగోడు నియోజకవర్గం అభివృద్ధి కోసమే పదవికి రాజీనామా చేసినట్టు చెప్పారు రాజగోపాల్‌రెడ్డి. మునుగోడు నియోజకవర్గం అభివృద్ధి చెందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రాంత ప్రజల క్షేమం కోసం, ఈ ప్రాంత అభివృద్ధి కోసమే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినట్టు చెప్పారు రాజగోపాల్‌రెడ్డి. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని పలుమార్లు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయిందని అన్నారు రాజగోపాల్‌రెడ్డి.