నేడు హైదరాబాదులో సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ భేటీపై భట్టి విక్రమార్క కూడా స్పందించారు. పాదయాత్రలో పాల్గొనాలని కోమటిరెడ్డిని ఆహ్వానించినట్టు తెలిపారు. కాగా, తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. రేవంత్ రెడ్డి తనను పాదయాత్రలో పాల్గొనాలని పిలవలేదని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపించారు. అయితే, తన పాదయాత్రలో పాల్గొనాలని భట్టి విక్రమార్క ఆహ్వానించారని, అందుకే తాను భట్టి విక్రమార్క పాదయాత్రలో పాల్గొంటానని వెల్లడించారు.
భట్టి విక్రమార్క పాదయాత్రపై కొన్ని సూచనలు చేశానని కోమటిరెడ్డి చెప్పారు. భట్టి పాదయాత్రకు తాను తప్పకుండా హాజరవుతానని తెలిపారు. నల్గొండ, మంచిర్యాల, జడ్చర్ల/షాద్ నగర్ లో బహిరంగ సభ… నకిరేకల్, సూర్యాపేటలో మినీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని సూచించినట్టు వివరించారు. పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో… శని, ఆదివారాల్లో మాత్రమే పాదయాత్రలో పాల్గొంటానని పేర్కొన్నారు.