పొత్తులపై నేను చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ అధిష్టానం లైట్ తీసుకుందన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారా ఇంఛార్జ్ మాణిక్‌రావు ఠాక్రేను కలిశారు. హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో భేటీ అయ్యారు.
బీఆర్ఎస్తో పొత్తు, రాష్ట్రంలో హంగ్ ప్రభుత్వం వస్తుందంటూ చేసిన వ్యాఖ్యలపై కోమటిరెడ్డి ఠాక్రేకు వివరణ ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.ఠాక్రేతో అనేక విషయాలు చర్చించాను. ముందస్తు ఎన్నికలకు వెళ్తే ఏం చేయాలనే దానిపై చర్చించాం. ఎన్నికలకు 6 నెలల ముందే అభ్యర్థులను ప్రకటించాలని చెప్పాను. గెలిచే వారికే టికెట్లు ఇవ్వాలని కోరాను. నా వ్యాఖ్యలను కొందరు వక్రీకరించారని చెప్పాను. ఇంకొంచెం కష్టపడితే 60 సీట్లు వస్తాయని చెప్పాను. పార్టీని గెలిపించే విషయంపై చాలాసేపు చర్చించాం. టికెట్లు, పొత్తులు, అభ్యర్థులు, సర్వేల గురించి మాట్లాడామని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు.