హైదరాబాద్ మహానగరంలో రోజుకు ఏదో ఒక మూలన ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురవుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వానికి అనేక ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో తాజాగా వీటిని నివారించేందుకు, ఆస్తుల పరిరక్షణ కోసం గ్రేటర్ అధికారులు నడుం కట్టారు. ఇందుకోసం జిహెచ్ఎంసి అధికారులు అస్సెట్ ప్రొటెక్షన్ సెల్ ను ఏర్పాటు చేసారు. ఇక దీనికి సంబంధించిన టోల్ ఫ్రీ నెంబర్ 1800 599 0099 ను ప్రగతి భవన్ లో మంత్రి కేటీఆర్ నేడు ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ… నగరంలోని ప్రభుత్వ ఆస్తుల రక్షణ కోసం ప్రజల యొక్క సహకారం కూడా అవసరమని మంత్రి పిలుపునిచ్చారు. ఎవరైనా బహిరంగ స్థలాల్లో కబ్జాకు పాల్పడిన లేక ప్రైవేట్ కార్యకలాపాలకు ఉపయోగించిన, చెరువు స్థలాలలో ఇండ్ల నిర్మాణం జరిగిన, ఇంకా ప్రైవేట్ వ్యక్తుల భూములను ఎవరైనా కబ్జాకు గురి చేసిన ఈ నెంబర్ కు ఫోన్ చేసి ఫిర్యాదు అందించవచ్చని తెలియజేశారు. ఇకపోతే ఈ అస్సెట్ ప్రొటెక్షన్ సెల్ టోల్ ఫ్రీ నెంబర్ ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పని చేస్తుందని తెలిపారు. ముందు ముందు ఈ కార్యక్రమాన్ని 24*7 గా సేవలందించేందుకు ప్రయత్నం చేస్తామని తెలిపారు.