తెలంగాణ ఆదాయాన్ని పెంచి పేదలకు సంక్షేమ పథకాల రూపంలో పంచాలనేదే తెరాస లక్ష్యం అని కేటీఆర్ పేర్కొన్నారు. మంగళవారం రాత్రి ఆయన శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని మియాపూర్ ఆల్విన్ క్రాస్ రోడ్స్‌లో ఎన్నికల ప్రచార రోడ్‌షోలో ఆయన మాట్లాడుతూ…రాష్ట్రం ఏర్పడిన తర్వాత హైదరాబాద్‌కు అనేక ఐటీ కంపెనీలు వస్తున్నాయన్నారు. ఇందులో భాగంగానే అమెజాన్, గూగుల్, ఫ్లిప్ కార్ట్ వంటి బహులజాతి కంపెనీల రాకతో ఆదాయం తెలంగాణ మరింత పురోగతిని సాధిస్తుందన్నారు. రాష్ట్రం 17శాతం అభివృద్ధితో ముందుకెళ్తోందని చెప్పారు.
ప్రజలు మళ్లీ అవకాశం ఇస్తే రాష్ట్ర వ్యాప్తంగా గల పేదలకు రెండు పడకగదుల ఇళ్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. నగరంలోని డొక్కు బస్సులను మార్చి 3800 బస్సులను ఎలక్ట్రిక్ వాహనాలుగా మారుస్తామన్నారు. ఆడపిల్లలు ఇంటి నుంచి బయటకు వెళ్తే వారు సురక్షితంగా ఇంటికి చేరేలా భద్రత కల్పిస్తామన్నారు. ఇప్పటికే రక్షణకు సంబంధించి పోలీసులకు అత్యాధునిక వాహనాలను సైతం సమకూర్చామన్నారు. ఒక్క కేసీఆర్‌ను, తెరాసను ఎదుర్కొనే ధైర్యం లేక నాలుగు పార్టీలు ఒక్కటయ్యాయని విమర్శించారు. సంక్షేమ కార్యక్రమాలకు కేసీఆర్ పెద్ద పీట వేశారని గుర్తు చేశారు.