ఉమ్మడి రాష్ట్రాల హైకోర్టు సంచలనాత్మక తీర్పుని వెల్లడించింది. అనంతపురం జిల్లా మడకశిర తెదేపా ఎమ్మెల్యే ఈరన్న ఎన్నిక చెల్లదని హైకోర్టు ప్రకటించింది. వైకాపా నేత తిప్పేస్వామిని మడకశిర శాసనసభ్యుడిగా ప్రకటిస్తూ ఆదేశాలు సైతం జారీ చేసింది. 2014 ఎన్నికల్లో మడకశిర నుంచి గెలిచిన ఈరన్న ఎన్నికను సవాల్ చేస్తూ వైకాపా అభ్యర్థి తిప్పేస్వామి దాఖలు చేసిన వ్యాజ్యంపై హైకోర్టు నేడు తీర్పువెలువరించింది.. ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన అఫిడవిట్‌లో ఈరన్న పూర్తి వివరాలు సమర్పించకుండా.. ప్రజా ప్రాతినిథ్య చట్టాన్ని ఉల్లంఘించారని తిప్పేస్వామి వాదించారు.
భార్య ఉద్యోగాన్ని కూడా అఫిడవిట్‌లో ప్రస్తావించలేదని.. కర్ణాటకలో తనపై ఉన్న కేసుల వివరాలును సైతం పొందుపరచలేదన్నారు. ఇరువైపుల వాదనలు విన్న కోర్టు సంబంధిత దస్త్రాలను పరిశీలించి తీర్పుని వెలువరించింది. దీంతో గత ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన వైకాపా నాయకుడు తిప్పేస్వామిని ఎమ్మెల్యేగా గుర్తించాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ విషయమై ఈరన్నను మీడియా వివరణ కోరగా హైకోర్టు తీర్పుపై దేశ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తా అన్నారు.