ఇటీవల విడుదల చేసిన సీఆర్‌పీఎఫ్ ఉద్యోగాల భర్తీ ప్రకటనలో కేవలం ఆంగ్ల, హిందీ మాధ్యమంలోనే పరీక్ష రాయడానికి అవకాశం కల్పించడంపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనివల్ల ఆంగ్ల మాధ్యమంలో చదవని వారికి, హిందీ ప్రాంతాలకు చెందని నిరుద్యోగ యువకులకు తీవ్రమైన అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. సీఆర్‌పీఎఫ్ పోస్టుల భర్తీకి విడుదల చేసిన నియామక ప్రకటనను తక్షణమే సమీక్షించుకోవాలని మంత్రి డిమాండ్ చేశారు. ఈ మేరకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షాకు మంత్రి కేటీఆర్ లేఖ రాశారు.
‘‘అనేక అధికార భాషలు కలిగిన భారతదేశంలో, కేవలం హిందీ వారికి మాత్రమే మాతృభాషలో పోటీ పరీక్షలు రాసే అవకాశం ఇవ్వడంరాజ్యాంగ స్ఫూర్తికి పూర్తిగా విరుద్ధం. దేశంలో రాజ భాష అంటూ ఏదీ లేదని రాజ్యాంగం స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వం ప్రాంతీయ భాషలను పట్టించుకోకుండా కేవలం హిందీ, ఆంగ్ల మాధ్యమాల్లో ఉద్యోగాల భర్తీ పరీక్షలు నిర్వహించడం రాజ్యాంగ విరుద్ధమే. సమాన అవకాశాలు పొందడం ఈ దేశ ప్రజలకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు. దానిని సీఆర్‌పీఎఫ్ తాజా నోటిఫికేషన్ కాలరాస్తోంది. గతంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలన్నింటినీ.. అన్ని గుర్తింపు పొందిన అధికారిక ప్రాంతీయ భాషల్లోనూ నిర్వహించాలి.’ అని కేటీఆర్ తన లేఖలో పేర్కొన్నారు.