కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌కు మంత్రి కేటీఆర్‌ లేఖ

-

రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్​కు లేఖ రాశారు. తెలంగాణ వచ్చినప్పటి నుంచి వినూత్నమైన పారిశ్రామిక విధానాలతో అద్భుతమైన పారిశ్రామిక ప్రగతిని సాధిస్తున్న తెలంగాణపై ఇకనైనా వివక్షను వీడాలని చెప్పారు. రాష్ట్రం ప్రతిపాదించిన ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలని, కొత్త ప్రాజెక్టులను మంజూరు చేయాలని కోరారు. ఎనిమిదేళ్లుగా ప్రతి బడ్జెట్‌ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వానికి ప్రోత్సాహకంగా దక్కాల్సిన నిధుల గురించి అనేకసార్లు కేంద్రానికి విజ్ఞప్తి చేసినా, చెప్పుకోదగ్గ ఆర్థిక సహాయమేదీ అందలేదన్నారు.

ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తన చివరి బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నందున రాష్ట్ర ప్రయోజనాలు, అభివృద్ధికి దోహద పడే పలు అంశాలపై సానుకూలంగా స్పందించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ‘”కేంద్ర ప్రభుత్వం మేకిన్‌ ఇండియా, ఆత్మనిర్భర్‌ భారత్‌ వంటి నినాదాలు, విధానాలను బలంగా నమ్మితే, వాటిని నిజం చేయగలిగే శక్తి కలిగిన తెలంగాణ వంటి అభివృద్ధికాముక రాష్ట్రాలను ప్రోత్సహించాలి. తెలంగాణలాంటి ప్రగతిశీల రాష్ట్రాలు బలంగా మారినప్పుడే దేశం మరింత ముందుకు సాగుతుంది. దేశ పారిశ్రామికరంగంలో తన స్వల్పకాలిక ప్రస్థానంతోనే అత్యంత కీలకంగా మారిన రాష్ట్రానికి ఈ బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించాలి.” అని కేటీఆర్ లేఖలో పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version