ప్రేమ పేరుతో విద్యార్థిని గొంతు కోసిన టీచర్…
కర్నూలు పట్టణంలోని బంగారుపేటలో శనివారం తెల్లవారుజామున దారుణం చోటుచేసుకుంది. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడే, ప్రేమ పేరుతో పెడదోవ పట్టాడు… ఈ రోజు ఉదయం బాలిక ఇంట్లోకి వెళ్లి ఆమె గొంతుకోసిన అనంతరం, నిందితుడు అదే కత్తితో తాను కూడా గొంతు కోసుకున్నాడు. శంకర్ అనే ఉపాధ్యాయుడు ఇంట్లోకి ప్రవేశించిన మరుక్షణమే బాలిక పెద్దగా కేకలు వేసింది. స్థానికులు అక్కడికి చేరుకునే లోపే బాలిక గొంతుకోశాడు. చుట్టుపక్కల వారు ఇంట్లోకి ప్రవేశించి శంకర్ ను పట్టుకునే క్రమంలో తాను కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడట్టు సమాచారం.
స్థానిక పాఠశాలలో హిందీ టీచర్ గా పనిచేస్తున్న శంకర్ అదే పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థినిపై కన్నేశాడు. దీంతో కొద్ది కాలంగా తనను ప్రేమించాలని వేధించడం మొదలుపెట్టాడు. అయితే ఇందుకు అంగీకరించని బాలిక విషయాన్ని తల్లికి చెప్పింది. దీంతో బాలిక కుటుంబసభ్యులు శంకర్ ను హెచ్చరించారు. కొద్ది రోజులుగా సైలెంట్ ఉన్న శంకర్ మద్యం మత్తులో శనివారం ఉదయం బాలికపై దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో గాయపడ్డ ఇద్దరిని వైద్యం కోసం ఆస్పత్రికి తరలించారు. బాలిక పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.