మహ్మద్ ప్రవక్తపై మాజీ బీజేపీ అధికార ప్రతినిధినుపుర్ శర్మ వ్యాఖ్యలు చేయడంతో దేశవ్యాప్తంగా నిరసన జ్వాలలు చెలరేగాయి. నుపుర్ శర్మ వ్యాఖ్యల పట్ల భారత్ లోనే కాదు, ముస్లిం దేశాల్లోనూ నిరసనలు వెల్లువెత్తాయి. కువైట్ లోనూ ప్రవాసులు నిరసన ప్రదర్శనలు చేపట్టారు. అయితే, నిరసనకారులపై కువైట్ తీవ్ర నిర్ణయం తీసుకుంది. తమ దేశంలో ప్రవాసులు ధర్నాలు, ఆందోళనలు చేపట్టడం నిషిద్ధమని, నిబంధనలను ఉల్లంఘించి నిరసన ప్రదర్శనలు చేపట్టిన విదేశీయులను వారి సొంత దేశాలకు తిప్పిపంపుతున్నట్టు కువైట్ ప్రభుత్వం వెల్లడించింది.
ప్రస్తుతం తమ అధికారులు నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్న వారిని గుర్తించి అరెస్ట్ చేస్తున్నారని, అనంతరం వారి స్వదేశాలకు తరలిస్తారని కువైట్ ప్రభుత్వాన్ని ఉటంకిస్తూ స్థానిక మీడియా పేర్కొంది. మరోసారి వాళ్లు కువైట్ లో ప్రవేశించడంపై నిషేధం ఉంటుందని కూడా అరబ్ టైమ్స్ పత్రిక తెలిపింది. అయితే, నుపుర్ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా చేపట్టిన నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్న వారు ఏ ఏ దేశాలకు చెందినవారన్నది కువైట్ ప్రభుత్వ వర్గాలు మాత్రం వెల్లడించలేదు.