ఆంధ్రా రాజకీయాల్లో అడుగు పెట్టను అని అంటున్నారు కేసీఆర్. అడుగు పెట్టినా పెట్టకపోయినా ఒకనాటి కోపం ఒకనాటి ద్వేషం మాపై ఆయన చూపిన నైజం అన్నింటినీ తాము మరువలేం అంటున్నారు ఆంధ్రులు. విభిన్న వాదనలు మధ్య కేసీఆర్ మారిపోయారా ? లేదా తన నైజం నుంచి పక్కకు తప్పుకుని రాజకీయం చేయాలని భావిస్తున్నారు. ఆ రోజు ఉద్యమాల్లో కేసీఆర్ – కు, ఇప్పటి కేసీఆర్-కు ఎంతో తేడా ఉంది. అదేవిధంగా ఇప్పటి కేసీఆర్-కు రేపటి కేసీఆర్-కు కూడాఎంతో తేడా ఉండనుంది. అంతగా ఆయన ప్రభావం ఆంధ్రాపై ఉంది. ఉండనుంది కూడా ! ఎందుకంటే ఉద్యమ కాలంలో ఆయన ఆంధ్రా నాయకులను తిట్టిపోశారు.
తమను దోచుకున్నారని తిట్టిపోశారు. పోనీ ఆ గణాంకాలు ఏమయినా తరువాత అయినా బయటపెట్టారా అదీ లేదు. ఇప్పుడు ఎలా అయితే కేంద్రం తమకు అన్యాయం చేస్తోంది. ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వడం లేదు.. మూడు వేల కోట్లకు పైగా డబ్బులు కేంద్రం నుంచి రావాల్సి ఉందని గగ్గోలు పెడుతున్నారో అలానే ఆ రోజు అధికారంలోకి రాగానే ఆంధ్రా పాలకుల తప్పిదాలు, ముఖ్యంగా నిధుల విషయంలో చేసిన తప్పిదాలు గురించి చెప్పి వాటిని ప్రజల ముందుకు తీసుకు రాలేకపోయారు ఆయన.
అదేవిధంగా ఆంధ్రాపాలకులను తిట్టడం కూడా కేవలం రాజకీయంలో భాగంగానే తప్ప ప్రాంత ప్రయోజనాల కోసం కానేకాదని తరువాత తేలిపోయింది కూడా! ఈ విధంగా చూసుకున్నా ఏ విధంగా మాట్లాడుకున్నా కేసీఆర్ ఆ రోజు కేవలం తన రాజకీయ ప్రయోజనాల్లో భాగంగానే అందరినీ తిట్టారు. అందరినీ ఉద్యమ దారిలోకి మళ్లించారు అన్నది ఇప్పటి ఓయూ జేఏసీ గగ్గోలు పెడుతోంది. పోనీ సొంత రాష్ట్ర్రం ఏర్పడ్డాక అయినా ఈ ప్రాంతం బాగోగులు ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం కాకుండా అందరికీ అభివృద్ధి అందేందుకు ఆలోచించారా ? ముఖ్యంగా అవినీతి లేని రాష్ట్ర నిర్మాణం చేశారా ? అన్న ప్రశ్నలూ వినిపిస్తున్నాయి.
ఈ దశలో కేసీఆర్ తనదైన వాగ్ధారతో మళ్లీ ఆంధ్రా నాయకులను ప్రసన్నం చేసుకున్నా చేసుకోగలరు. ఎందుకంటే ఆ రోజు తిట్లు ఆ రోజు శాపనార్థాలు అన్నవి రాజకీయంలో భాగం అయినవి కనుక వాటిని అలా వదిలేయండి అని చెప్పినా చెప్పగలరు. కనుక ఆయన ఆంధ్రాలో పాలిటిక్స్ చేయరు అని చెప్పలేం. భావ సారూప్యత పేరిట కాంగ్రెస్-తో జతగట్టి ఉమ్మడి అభ్యర్థులను అయినా
తెరపైకి తీసుకువచ్చే ప్రయత్నాలు చేయనూవచ్చు. చెప్పలేం. లేదా రేపటి వేళ ఎన్నికలయ్యాక జగన్-తో కలిసి ఢిల్లీ రాజకీయాలు చేయనూవచ్చు. ఏమో చెప్పలేం. కేసీఆర్ మాటల మాంత్రికుడు కదా! ఏమయినా చేయడం ఆయనే చెల్లు. ఆ విధంగా ధీశాలి అతడు.
రాజకీయం తనకు అనుగుణంగా నడపడంలో నేర్పరి అతడు. భాష పై ఉన్న పట్టు కారణంగా మళ్లీ,మళ్లీ ప్రజలను తన బుట్టలో వేసుకోగల సమర్థుడు అతడు. కేసీఆర్ మారడు మారిన విధంగా పైకి కనిపిస్తాడు. ఆ పాటి అర్థం చేసుకోవడం తెలివితనం. కొందరికి అర్థం కాకుండా ఉండడం అతని నైజం. అర్థం అయ్యాక కూడా ఆయనతోనే రాజకీయం చేయాలనుకోవడం కొందరి అవసరం.. ఇంకొందరి అమాయకత్వం కూడా !