ఏపీ అధికారుల్లో ల్యాండ్ ఇన్వెస్ట్‌మెంట్‌ టెన్షన్

-

ఏపీలో రాజధాని వికేంద్రీకరణకు సర్వం సిద్దమవుతున్న వేళ ప్రభుత్వం ఉద్యోగుల్లో కొత్త టెన్షన్ మొదలైందట. విశాఖను ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ను చేసింది ఏపీ ప్రభుత్వం. అధికారికంగా తేదీ ఖరారు కాకున్నా.. ఉగాదినాటికి విశాఖ నుంచి కార్యకలాపాలు నిర్వహించేందుకు రంగం సిద్ధమవుతోందనే చర్చ జరుగుతోంది. అయితే రాజధాని విశాఖకి తరలించే విషయం కంటే ఉద్యోగులను మరో సమస్య పట్టి పీడిస్తుందట.ఏ ఇద్దరు అధికారులు కలిసినా నెల తిరిగే సరికి కట్టే వాయిదాలతో తమ చేతి చమురు గట్టిగానే వదులుందని లెక్కలేస్తున్నారట.

ఏపీలోని ఐఏఎస్‌, ఐపీఎస్‌ వర్గాల్లో ఇన్వెస్ట్ మెంట్ టెన్షన్ పట్టుకుందట. గత ప్రభుత్వ హయాంలో ఏపీలో పని చేసే అఖిల భారత సర్వీసుల అధికారులకు అమరావతిలో భూములను కేటాయించారు. కోర్‌ క్యాపిటల్‌ ఏరియాలోనే వీరికి భూముల కేటాయింపు జరిగింది. అప్పట్లో గజం విలువ 1500 రూపాయలుగా ఉంటే.. అన్ని రకాల వసతులు కల్పిస్తాం.. రోడ్లేస్తాం.. అన్ని రకాల కనెక్టివిటీలు కల్పిస్తామని చెప్పి.. గజం ధరను 5వేల రూపాయలుగా ఫిక్స్‌ చేసి ఒక్కోక్కరికి 500 గజాలను కేటాయించింది నాటి ప్రభుత్వం.

దాదాపు 400 మందికి పైగా ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఎఫ్‌ఎస్‌ అధికారులు 500 గజాల చొప్పున స్థలాన్ని తీసుకున్నారు. దీనికోసం బ్యాంకుల్లో అప్పులు తీసుకుని నెలకు 33 వేల రూపాయల చొప్పున ఈఎంఐ కట్టేలా లోన్‌ కెళ్లారు చాలా మంది. ఇంత వరకు బాగానే ఉన్నా.. రాష్ట్రంలో ప్రభుత్వం మారడం.. పరిపాలనా రాజధానిగా విశాఖను ఎంపిక చేయడంతో వారి గొంతులో పచ్చివెలక్కాయ పడ్డట్టయిందట. ఇప్పుడు ఇదే అంశంపై పలువురు ఐఏఎస్సుల్లో చర్చ జరుగుతోన్నట్టు సమాచారం.

తమకు కేటాయించిన భూమి ఎక్కడో మారుమూల ఉంది. పోనీ.. ఇక్కడ రాజధాని ఉంటుందా అంటే అదీ లేదు. రాజధాని ఉన్నా.. లేకున్నా తమ భూమి ధరైనా పెరుగుతుందన్న గ్యారెంటీ లేదు. సమీప భవిష్యత్‌లో అది కన్పించడం లేదన్నది ఇన్నర్‌ సర్కిల్స్‌లో జరిగే సంభాషణల్లో వాపోతున్నారట పలువురు ఐఏఎస్సులు. ఏదో ఇన్వెస్ట్‌మెంట్‌ రూపంలో ఓ ఆస్తిని కూడబెట్టుకుందామనే ఉద్దేశంతో సేవింగ్స్‌ను ఈ విధంగా మళ్లిస్తే.. అది కాస్త డెడ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌గా మారిపోతోందని ఆవేదన చెందుతున్నారట.

రాజధాని తరలింపు సాధ్యాసాధ్యాలు.. లాభ నష్టాల కంటే తమకు వ్యక్తిగతంగా జరుగుతున్న నష్టం పైనే ఎక్కువ మదనపడుతున్నారట. అటు బయట చెప్పుకోలేక.. ఇటు దిగమింగలేక సతమతమవుతున్నారట పలువురు అధికారులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version