వైసీపీలో ర‌జ‌నీ వ‌ర్సెస్ శ్రీకృష్ణ‌… కొత్త యుద్ధం మొదలైంది…!

-

ఏపీలో అధికార వైసీపీలో ఆధిపత్య పోరు ఎక్కువగా నడుస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో ఎక్కువ నియోజకవర్గాల్లో సొంత పార్టీ నేతలకే పెద్దగా పడటం లేదు. అలాగే గుంటూరు జిల్లాలో నరసారావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజనిలకు పెద్దగా పొసగని సంగతి తెలిసిందే. చాలా కాలం నుంచి వీరి ఇరు వర్గాల మధ్య చిన్నపాటి యుద్ధమే నడుస్తోంది. పేటలో ఉన్న సీనియర్ నేత మర్రి రాజశేఖర్ వర్గానికి, ఎంపీ సపోర్ట్ ఉందని తెలిసి, ఎమ్మెల్యే వర్గం పలుమార్లు శ్రీకృష్ణని పేటలో అడుగుపెట్టనివ్వకుండా అడ్డుకునేందుకు చూశారు.

దీంతో ఎంపీ ఎప్పటినుంచో ఎమ్మెల్యేలపై గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే తాజాగా ఎమ్మెల్యే వర్గాన్ని టార్గెట్ చేసి ఎంపీ పావులు కదిపినట్లు సమాచారం. ఓ ప్రముఖ మీడియా కథనం ప్రకారం ఎమ్మెల్యే వర్గంలో కొందరు వ్యక్తులు ఇళ్ల పట్టాలకు సంబంధించిన భూముల సేకరణలో రైతుల దగ్గర నుంచి పెద్ద మొత్తంలో కమీషన్లు వసూలు చేశారని, అలాగే పేటలో ఎమ్మెల్యే అనుచరులు అక్రమ తవ్వకాలు జరుపుతున్నట్లు ఎంపీ, అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఇవన్నీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలోనే జరిగాయని ఎంపీ ఆరోపణ.

ఇక ఈ విషయాలతో తనకు సంబంధం లేదని ఎమ్మెల్యే, పార్టీ అధిష్టానానికి చెప్పినట్లు సమాచారం. ఇదే సమయంలో తన పీఏతో తన ఫోన్, ఇంకా ఓ అనుచరుడు ఫోన్లుపై నిఘా పెట్టి, ఓ డి‌ఎస్‌పి, సి‌ఐలు సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకుని ఎమ్మెల్యే పార్టీలో ఓ కీలక నేతకి ఫిర్యాదు చేయడంతో, ఆ నేత పోలీసు శాఖ ద్వారా డి‌ఎస్‌పి, సి‌ఐలని వీఆర్‌కు పంపుతూ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిసింది. అంటే ఇక్కడ ఎమ్మెల్యే, ఎంపీల మధ్య వివాదం ఇంకా కొనసాగుతున్నట్లే కనబడుతోంది. ఏదేమైనా ర‌జ‌నీ వ‌ర్సెస్ శ్రీకృష్ణ మ‌ధ్య వార్ రోజు రోజుకు మ‌రింత ముదురుతోంది.

 

-vuyyuru subhash

 

Read more RELATED
Recommended to you

Exit mobile version